
Infosys: 'ఓవర్ టైమ్ వద్దు'… ఉద్యోగులకు ఇమెయిల్స్ పంపిన సంస్థ… నారాయణమూర్తి వ్యాఖ్యలు మరోసారి చర్చలోకి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తన ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, పని-ప్రైవేట్ జీవిత సమతుల్యత (వర్క్-లైఫ్ బ్యాలెన్స్)ను పరిరక్షించేందుకు కీలక సూచనలు చేసింది. ఉద్యోగులు విధిగా నిర్ణయించిన పని గంటలకన్నా ఎక్కువగా పనిచేయరాదని సంస్థ స్పష్టంగా హితవు పలికింది. ఇందులో భాగంగా, అదనంగా పని చేస్తున్న ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఇమెయిల్స్ పంపించి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలని, సమయానికి తినడం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తోంది. ప్రస్తుతం దాదాపు 3.23 లక్షల మంది ఉద్యోగులు ఉన్న ఈ ఐటీ దిగ్గజం 2023 నవంబర్ నుంచి హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అమలు చేస్తోంది.
వివరాలు
0 రోజులు ఉద్యోగులు ఆఫీస్‌కి వచ్చి పని చేయాలన్న ఇన్ఫోసిస్
ఇందులో భాగంగా ప్రతి నెల కనీసం 10 రోజులు ఉద్యోగులు ఆఫీస్‌కి వచ్చి పని చేయాలని సూచించింది. అయితే ఇటీవల,అధిక పని గంటలు, నిద్రలేమి, సమయానికి భోజనం చేయకపోవడం వంటి కారణాలతో ఉద్యోగులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సంస్థ గుర్తించింది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్న నేపథ్యంలో, సంస్థ హ్యూమన్ రిసోర్సెస్ విభాగం ఉద్యోగుల ఆరోగ్యంపై అప్రమత్తమై, తగిన సూచనలు అందిస్తోంది. ఇన్ఫోసిస్‌లో వారానికి ఐదు రోజుల పాటు,రోజుకు సగటున 9.15గంటల పనిని అనుసరిస్తున్నారు. అయితే కొన్ని దఫాల్లో ఈ సమయాన్ని మించి పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను గుర్తించి, వారికీ ప్రత్యేకంగా మెయిల్ పంపిస్తున్నారు. ముఖ్యంగా రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగులకు వారు ఏ రోజు ఎంతసేపు పనిచేశారో వివరంగా తెలియజేస్తున్నారు.
వివరాలు
నారాయణమూర్తి అలా..
అదేవిధంగా, పని సమయంలో మధ్య మధ్యలో విరామాలు తీసుకోవాలని, పని ముగిశాక విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప, పని గంటల అనంతరం ఉద్యోగ జీవితానికి సంబంధించి పనులకు వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తోంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి గతంలో భారత్‌లో ప్రజలు వారానికి 70 గంటల పాటు పని చేయాలన్న వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారాన్ని రేపింది. చాలామంది ఆ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించినా,ఆయన మాత్రం తన అభిప్రాయాన్ని మళ్లీ ఒక సందర్భంలో సమర్థించారు. 1986లో దేశంలో ఐదు రోజుల పని విధానం ప్రారంభం అయినప్పటి నుంచీ ఆయన దానికి వ్యతిరేకంగా ఉన్నారు. ర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు తాను వ్యతిరేకమంటూ కుండబద్దలు కొట్టారు.
వివరాలు
ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడంతో కొత్త చర్చ
ఇలాంటి వ్యాఖ్యల తరువాత, ఇన్ఫోసిస్ ఇప్పుడు ఉద్యోగుల ఆరోగ్యాన్ని పట్టించుకొని వారిని ఓవర్ టైమ్ చేయకుండా చూసుకోవడంపై దృష్టి పెట్టడం కొత్త చర్చకు దారితీసింది. సంస్థ నిర్ణయం,నారాయణమూర్తి వ్యాఖ్యల మధ్య విభిన్నతపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనితో, కంపెనీ పాలసీ,వ్యవస్థాపకుని భావజాలం ఒకదానికొకటి విరుద్ధమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.