Nayara Petrol: నయారా ఎనర్జీ షాక్: పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రైవేటు రంగానికి చెందిన చమురు సంస్థ నయారా ఎనర్జీ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలను పెంచింది. ఈ కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెంపు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను బట్టి పెరుగుదల ప్రభావం మారుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ పెంపు గరిష్ఠంగా రూ.5.30 వరకు ఉండే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ, రష్యాకు చెందిన చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్‌కు అనుబంధంగా పనిచేస్తున్న నయారా ఎనర్జీ మొత్తం 6,967 పెట్రోల్ పంపులను నిర్వహిస్తోంది.
వివరాలు
వినియోగదారులకు ఊరటనిచ్చిన రిలయన్స్-బీపీ
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ ధరల సవరణ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో మరో ప్రముఖ ప్రైవేటు చమురు సంస్థ రిలయన్స్-బీపీ మాత్రం వినియోగదారులకు ఊరటనిచ్చింది. ఈ సంస్థ పెట్రోల్,డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.దేశవ్యాప్తంగా జియో-బీపీ పేరుతో 2,185 అవుట్‌లెట్లను నిర్వహిస్తోంది. మరోవైపు మార్కెట్లో సుమారు 90 శాతం వాటా కలిగిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC),బీపీసీఎల్ (BPCL),హెచ్‌పీసీఎల్ (HPCL) కూడా సాధారణ పెట్రోల్,డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ప్రీమియం పెట్రోల్ ధరను మాత్రం ఇటీవల లీటరుకు రూ.2.30 మేర పెంచాయి. అలాగే ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటరుకు రూ.22 వరకు పెంచినట్లు సమాచారం.