
Nestle Layoffs: నెస్లేలో 16వేల ఉద్యోగాల కోత..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అతిపెద్ద ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీ సంస్థ నెస్లే,విస్తృత స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. మొత్తం 16వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసిందని సీఈఓ ఫిలిప్ నవ్రాటిల్ గురువారం ప్రకటించారు. ఈ లేఆఫ్‌లు రానున్న రెండు సంవత్సరాల వ్యవధిలో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. "ప్రపంచం వేగంగా మారుతోంది.ఆ మార్పులకు అనుగుణంగా నెస్లే కూడా తన పనితీరును మార్చుకోవాల్సి ఉంది.ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ,ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ఆ మార్పు దిశలో ఒక కీలక భాగం"అని ఒక ప్రకటనలో భాగంగా సీఈఓ వెల్లడించారు. ప్రస్తుతం ఉత్పత్తి,సరఫరా విభాగాల్లో సుమారు 4,000మంది ఉద్యోగులు ఇప్పటికే లేఆఫ్ ప్రక్రియలో ఉన్నారు,ఇక మిగతా 12,000మంది వైట్‌కాలర్ ఉద్యోగులు త్వరలో ఈజాబితాలో చేరనున్నట్లు సమాచారం.
వివరాలు
తగనున్న వ్యయభారం
ఈ భారీ కోత ద్వారా సంస్థకు ఒక బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ వరకు వ్యయభారం తగ్గనుంది. నెస్లే 2027 నాటికి మొత్తం 3బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ పొదుపు లక్ష్యాన్ని నిర్ణయించింది. 2000కంటే ఎక్కువ బ్రాండ్లు కలిగిన ఈ స్విస్ కంపెనీ ఇటీవల నాయకత్వ అస్థిరతను కూడా ఎదుర్కొంది. తన సబ్‌ఆర్డినేట్‌తో సంబంధం పెట్టుకున్న కారణంగా లారెంట్ ఫ్రీక్సే సీఈఓ పదవి నుంచి తొలగించబడ్డాడు. ఈ చర్య సంస్థ నిబంధనలకు విరుద్ధమని నెస్లే ప్రకటించింది. ఆ ఘటన అనంతరం,సంస్థ ఛైర్మన్ పాల్ బుల్కే కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ప్రకటించిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో,సంస్థ పనితీరు అంచనాలను మించిందని తెలిసినా,గత ఏడాదితో పోలిస్తే లాభాలు 24శాతం తగ్గినట్లు నివేదికల్లో వెల్లడైంది.