Budget 2026: ఏప్రిల్ 1 నుంచి నూతన ఆదాయపు పన్ను చట్టం: నిర్మలా సీతారామన్
ఈ వార్తాకథనం ఏంటి
రానున్న ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను లోక్‌సభలో ప్రవేశపెట్టుతూ, పన్ను చట్టంలో సామాన్యులకు సులభతరం చేసే మార్పులు చేసినట్లు వివరించారు. ఈ మార్పుల వల్ల పన్ను రిటర్న్ ఫారాలు మరింత సులభంగా,త్వరగా ఫైల్ చేయగలుగుతాయని ఆమె చెప్పారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువును కూడా పెంచుతున్నట్టు ఆమె ప్రకటించారు. సాధారణంగా డిసెంబర్ 31తో ముగిసే గడువును మార్చి 31వరకు పొడిగించడం జరిగింది. అలాగే, విదేశీ ప్రయాణాలపై పన్ను భారం తగ్గిస్తున్నట్లు,విదేశీ విద్య,వైద్యానికి వచ్చే టీడీఎస్ ను 5 శాతం నుండి 2శాతం వరకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
మానవ వనరుల సరఫరా సంస్థలపై టీడీఎస్ తగ్గింపు
మానవ వనరుల సరఫరా సంస్థలపై కూడా టీడీఎస్ తగ్గింపు వర్తించనుంది.ఈ ఏజెన్సీలపై 1 లేదా 2 శాతం మాత్రమే టీడీఎస్ ఉంటుందని పేర్కొన్నారు. రహదారి ప్రమాదాల పరిహార వడ్డీపై పన్ను పూర్తిగా తొలగించబడనుందని కూడా పేర్కొన్నారు. అలాగే, చిన్న మొత్తంలో పన్ను చెల్లించే వ్యక్తుల కోసం ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. విదేశీ ఆస్తుల వివరాలను ఇప్పటి నుండి తప్పనిసరిగా వెల్లడించాల్సిన విధంగా మారిందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
వివరాలు
కంపెనీల బైబ్యాక్ విధానాలకు సంబంధించి కీలక నిర్ణయం
అదే సమయంలో, కంపెనీల బైబ్యాక్ విధానాలకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 2 శాతం పన్ను విధించనుంది, నాన్-కార్పొరేట్ బైబ్యాక్ పై 30 శాతం పన్ను విధించనుంది. పన్ను వివాదాల విషయంలో క్రిమినల్ చర్యలను తక్కువ చేసి, జైలు శిక్షను రెండేళ్లకు తగ్గించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక, జరిమానా చెల్లిస్తే ఆ జైలు శిక్ష నుండి మినహాయింపు పొందగలుగుతారు.