LOADING...
Gold : దీపావళి నుంచి నూతన మార్కెట్.. బంగారం ధర తగ్గుతుందా..? పెరుగుతుందా?
దీపావళి నుంచి నూతన మార్కెట్.. బంగారం ధర తగ్గుతుందా..? పెరుగుతుందా?

Gold : దీపావళి నుంచి నూతన మార్కెట్.. బంగారం ధర తగ్గుతుందా..? పెరుగుతుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారాన్ని మనుషులు తయారు చేయలేరు.అది భూమి గర్భంలోనో, సముద్ర గర్భంలోనో దొరికేది మాత్రమే. అయితే ప్రతేడాది బంగారం లభ్యత తగ్గిపోతూ వస్తోంది. భూగర్భంలో, సముద్రగర్భంలో ఇంకా నిల్వలు ఉన్నప్పటికీ, మైనింగ్ ద్వారా వెలికితీసే పరిమాణం తగ్గిపోతోంది. దాంతో బంగారం డిమాండ్ భారీగా పెరిగి, ధరలు తారా స్థాయికి చేరాయి. ఫ్యూచర్ మార్కెట్లకే తలనొప్పిగా మారిన ఈ పరిస్థితిలో, అపరంజి వెలుగులు ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా మెరవలేదు. కాలాలు, దేశాలు మారినా, బంగారానికి విలువ ఎప్పుడూ తగ్గదు. గత వందేళ్ల చరిత్ర చూస్తే ప్రతిదశలో ధరలు పెరుగుతూనే వచ్చాయి.అయితే గత దశాబ్దంలో ఆ పెరుగుదల మరింత వేగంగా సాగింది. ముఖ్యంగా ఈ ఏడాది బంగారం ధరలు అసాధారణంగా పెరిగి, ఏకంగా 60శాతం దూసుకుపోయాయి.

Details

నిల్వలు వెలికతీయడం కష్టతరమవుతోంది

అంచనాలన్నీ చెరిపేస్తూ పుత్తడి రేటు రికార్డులు బద్దలుకొడుతోంది. పెట్టుబడి మార్గాల్లో ఉన్న అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు మొగ్గుతున్నారు. దీనికి ప్రధాన కారణం- బంగారం లభ్యత క్రమంగా తగ్గిపోవడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం గనులు పరిమితంగానే ఉన్నాయి. ఉత్పత్తి స్థాయి స్థిరంగా ఉండగా, డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంది. బంగారం తీయడం చాలా ఖరీదైన ప్రక్రియ. పైగా, అన్ని ప్రాంతాల్లో మైనింగ్ చేయడం సాధ్యమయ్యే పనికాదు. ఫలితంగా నిల్వలు ఉన్నా వాటిని వెలికితీయడం కష్టమవుతోంది. కొన్ని దేశాల్లో గనులు పూర్తిగా మూతపడ్డాయి. మన దేశంలోని కేజీఎఫ్‌ గనులు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. కొత్త గనులు వెలుగులోకి రావడం తక్కువగా ఉండటం, పాత గనుల్లో ఉత్పత్తి పరిమితికి చేరుకోవడం..

Details

కొత్త మార్గాల్లో బంగారం వెలికితీసే అవకాశం

మొత్తం మీద బంగారం ఉత్పత్తి పెరగడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో లభ్యమయ్యే కొద్ది బంగారాన్ని జాగ్రత్తగా వాడుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే పరిమిత సరఫరా-అపరిమిత డిమాండ్‌ అనే వ్యత్యాసం పసిడి ధరలను ఎగదోస్తోంది. ప్రస్తుతం అనూహ్యమైన గోల్డ్ డిమాండ్ చూసి ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురవుతున్నాయి. కొత్త మార్గాల్లో బంగారం వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నా, ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. భారతదేశం కూడా మైనింగ్‌ వేస్ట్‌ నుండి బంగారం పొందే మార్గాలను పరిశీలిస్తోంది. అయితే ఈ పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. వాటి ద్వారా ఎంతవరకు ఫలితం దక్కుతుందో చెప్పడం కష్టమే. ఈఅనిశ్చితిలో ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు, పెట్టుబడిదారులు అందరూ బంగారం సేకరణలో తీవ్రంగా పోటీ పడుతున్నారు.

Details

ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్

అంతర్జాతీయ రాజకీయ అస్థిరతలు, యుద్ధాలు, మార్కెట్‌ తారుమార్లు - ఇవన్నీ బంగారాన్ని సేఫ్‌ హెవెన్‌గా నిలబెడుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండటంతో బంగారంపై ఆకర్షణ పెరిగింది. అమెరికా డాలర్‌ బలహీనపడటంతో విదేశీ కొనుగోలుదారులకు గోల్డ్‌ చౌకగా మారింది. ఫలితంగా పెద్ద పెట్టుబడిదారులు, సంస్థలు, సాధారణ ప్రజలు కూడా ఈటీఎఫ్‌లు, నాణేలు, బార్‌ల రూపంలో బంగారం కొనుగోలు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే డబ్బు విలువ తగ్గుతుంది. కానీ బంగారం మాత్రం సంపదను కాపాడే సాధనంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నా, భారతదేశంలో బంగారానికి ఉన్న ప్రత్యేక స్థానం వేరే. ఇక్కడ పసిడి ఆభరణాలు సంప్రదాయంలో భాగం. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు బంగారం లేక పూర్తవు.

Details

వేగంగా పెరుగుతున్న బంగారం ధర

ఈ సామాజిక, ఆర్థిక డిమాండ్ వల్ల భారతదేశంలో బంగారం రేటు మరింతగా పెరుగుతోంది. గత పదేళ్లలో బంగారం ధర సుమారు లక్ష రూపాయలు పెరిగింది. కేవలం గత తొమ్మిది నెలల్లోనే 44 వేల రూపాయల పెరుగుదల చోటుచేసుకుంది. గత ఏడాది చివర్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,000 ఉండగా, ఇప్పుడు అదే రూ.1,34,000 దాటింది. అంటే బంగారం రేటు దూకుడు అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇరవై ఏళ్ల గణాంకాలు చూస్తే ఈ పెరుగుదల ఏకధాటిగా కొనసాగింది. 2000లో 10 గ్రాముల బంగారం ధర రూ.4,400 ఉండగా, 2005లో రూ.7,000, 2010లో రూ.18,500, 2015లో రూ.26,300, 2020లో రూ.48,600గా నమోదైంది. ఇప్పుడు అదే ధర రూ.1.34 లక్షలు దాటింది.

Details

సంవత్సరానికి 15శాతం వృద్ధి

అంటే ప్రతి ఐదేళ్లకు సగటున 50-60 శాతం పెరుగుదల. సంవత్సరానికి కనీసం 15 శాతం వృద్ధి నమోదవుతోంది. కరోనా కాలంలో తాత్కాలికంగా పెరిగిన బంగారం రేటు లక్ష దాటటానికి పదేళ్లు పడుతుందని అంచనాలు ఉన్నా, కేవలం ఐదేళ్లలోనే ఆ అంచనాలను బంగారం తుడిచేసింది. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితి కూడా దీనికి తోడు అవుతోంది. చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. వేతనాల పెంపు దూరమైపోయింది. సామాన్యుడు ఖర్చులు తగ్గించుకుంటూ, అప్పుల భయంతో జీవనం సాగిస్తున్నాడు. బ్యాంకులు పెద్ద పారిశ్రామిక వేత్తల రుణాలను రద్దు చేస్తూ, చిన్నమొత్తం వినియోగదారులపై భారాలు మోపుతున్నాయి.

Details

సురక్షిత మార్గం వైపు పెట్టుబడిదారులు

ఇలాంటి కష్టకాలంలో పొదుపు అలవాట్లు కూడా తగ్గిపోవడంతో జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. అదే సమయంలో మార్కెట్‌ పెట్టుబడులు, షేర్‌లు, మ్యూచువల్‌ ఫండ్లు ఆశించిన రాబడులు ఇవ్వకపోవడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గం కోసం చూస్తున్నారు. అప్పుడు గుర్తొచ్చేది బంగారం మాత్రమే. దాంతో పసిడి మరింత అపురూపమైపోతుంది. ప్రస్తుత పరిస్థితులు, సమీప భవిష్యత్‌ అంచనాలు ఏవి చూసినా — బంగారం వెలుగు తగ్గే సూచనలు లేవు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఉత్పత్తి పరిమితులు అన్నీ కలిపి బంగారాన్ని మరోసారి "అపరంజి యుగం"లోకి నడిపిస్తున్నాయి.