LOADING...
New Rules: జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. గ్యాస్ ధరల నుంచి బ్యాంకింగ్ వరకు భారీ మార్పులు!
జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. గ్యాస్ ధరల నుంచి బ్యాంకింగ్ వరకు భారీ మార్పులు!

New Rules: జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. గ్యాస్ ధరల నుంచి బ్యాంకింగ్ వరకు భారీ మార్పులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ నెల ప్రారంభానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంకు సెలవులు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, బ్యాంకింగ్ నిబంధనలు, సోలార్ ప్యానెళ్లకు సంబంధించిన కొత్త నియమాలు వంటి అంశాలు ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలోనే పలు ఆర్థిక, పరిపాలనా మార్పులు అమల్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలను వినియోగించే కోట్లాది మంది కస్టమర్లకు బ్యాంకు సెలవులు, నిబంధనల మార్పులు కీలకంగా మారుతాయి. రోజువారీ లావాదేవీల్లో బ్యాంకుల పాత్ర కీలకమైనందున సెలవుల షెడ్యూల్‌లో మార్పులు ప్రజల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

వివరాలు

హెచ్‌డీఎఫ్‌సీ పలు మార్పులు

ఇక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల విషయానికొస్తే, ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు కొత్త ధరలను ప్రకటిస్తాయి. గత మూడు నెలలుగా వరుసగా ధరలు పెరుగుతుండటంతో జూన్‌లో కూడా ధరలు పెరుగుతాయా లేదా యథాతథంగా కొనసాగుతాయా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈసారి ధరలపై చమురు సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నదానిపై వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, జూన్ 1 నుంచి ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కొన్ని ఖాతాలకు సంబంధించిన నిర్వహణ నిబంధనల్లో మార్పులు తీసుకురానుంది. కొత్త నిబంధనల ప్రకారం నోట్లు, నాణేలు డిపాజిట్ చేసే ఖాతాదారులపై ప్రత్యేక ఛార్జీలు విధించనుంది.

వివరాలు

కీలక మార్పులు చేయనున్న కేంద్ర

నోట్లు డిపాజిట్ చేసే మొత్తంపై 4శాతం, నాణేలు డిపాజిట్ చేసే మొత్తంపై 5 శాతం వరకు రుసుము వసూలు చేయనుంది. అలాగే రూ.20 నోట్ల డిపాజిట్ విలువ రూ.10 వేలకంటే ఎక్కువ ఉండకూడదని, నాణేల డిపాజిట్ మొత్తం రూ.5 వేల పరిమితిని మించకూడదని నిబంధనలు పేర్కొన్నాయి. ఈ పరిమితులను దాటితే అదనంగా మరో 2 శాతం ఛార్జీ విధించనున్నట్లు బ్యాంకు తెలిపింది. దీంతో భారీ మొత్తాల్లో నగదు, నాణేలు జమ చేసే ఖాతాదారులపై ఈ మార్పులు ప్రభావం చూపనున్నాయి. అదే సమయంలో, జూన్ 1నుంచి సోలార్ ప్యానెళ్లకు సంబంధించిన నిబంధనల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మార్పులు అమలు చేయనుంది. ఇకపై ప్రభుత్వం ఆమోదించిన సోలార్ ప్యానెళ్లను ఉపయోగించిన వారికే ప్రభుత్వ సబ్సిడీ లభించనుంది.

Advertisement

వివరాలు

జూన్ నుంచి సోలార్ ప్యానెళ్ల ధరలు పెరిగే అవకాశం

నాణ్యమైన సోలార్ పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త నిబంధనల కారణంగా జూన్ నుంచి సోలార్ ప్యానెళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక జూన్ నెలలో బ్యాంకు సెలవుల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మొహర్రం సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. తెలంగాణలో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, అలాగే మొహర్రం రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది. అదనంగా జూన్ 15, 25, 26, 29, 30 తేదీల్లో రెండో, నాలుగో శనివారాలు మరియు ఆదివారాల కారణంగా బ్యాంకులు సాధారణ సెలవులు పాటించనున్నాయి.

Advertisement