LOADING...
New Solar Panel : జూన్ 1 నుంచిపెరగనున్న సోలార్ ప్యానెళ్లు ధరలు
జూన్ 1 నుంచిపెరగనున్న సోలార్ ప్యానెళ్లు ధరలు

New Solar Panel : జూన్ 1 నుంచిపెరగనున్న సోలార్ ప్యానెళ్లు ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడానికి చాలా మంది ఇళ్లపై సౌర పలకలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో నెలవారీ విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు నిరంతర విద్యుత్ సౌకర్యం కూడా లభిస్తోంది. ముఖ్యంగా వేసవికాలంలో విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఉపయోగకరంగా మారుతున్నాయి. ప్రభుత్వం కూడా రాయితీలు అందిస్తుండటంతో సౌర పలకాల ఏర్పాటు పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే జూన్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే కొత్త నిబంధనల వల్ల సౌర వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే వారికి అదనపు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

మరింత కఠినమైన నిబంధనలు

ఇళ్లలో ఉపయోగించే సౌర పలకాల విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు సౌర పలకలు ప్రభుత్వ ఆమోదిత జాబితా (ఏఎల్‌ఎంఎం జాబితా-1)లో ఉండటం తప్పనిసరి కాగా,ఇకపై వాటిలో ఉపయోగించే చిన్న సౌర కణాలు కూడా ప్రభుత్వ ఆమోదిత జాబితా (జాబితా-2)లో ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నాణ్యత లేని విదేశీ పరికరాల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పుల కారణంగా సౌర వ్యవస్థల ధరలు పెరిగే అవకాశముందని రంగ నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

రాయితీలు యథాతథం

ఒక కిలోవాట్ సౌర వ్యవస్థ ఏర్పాటు చేయడానికి గతంతో పోలిస్తే అదనంగా సుమారు రూ.3 వేల వరకు ఖర్చు కావొచ్చని అంచనా వేస్తున్నారు. అదే రెండు కిలోవాట్ల వ్యవస్థకు రూ.6 వేల వరకు, మూడు కిలోవాట్ల వ్యవస్థకు రూ.9 వేల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సౌర పలకాల ధరలు పెరిగినా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టమైంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సహాయం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక కిలోవాట్ వ్యవస్థకు రూ.30వేలు,రెండు కిలోవాట్లకు రూ.60వేలు,మూడు కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల వ్యవస్థలకు రూ.78వేల వరకు రాయితీ అందుబాటులో ఉంటుంది.

Advertisement

వివరాలు 

రాయితీలు యథాతథం

కొత్త నిబంధనల కారణంగా కేంద్ర ప్రభుత్వం రాయితీలను నిలిపివేస్తుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తున్నారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదనపు ప్రోత్సాహక రాయితీలు అందిస్తున్నాయి. 'టాప్ అప్' విధానంలో ఇచ్చే ఈ ప్రయోజనాలు కూడా కొనసాగనున్నాయి.

Advertisement