New Zealand: తీవ్ర ఆర్థిక మాంద్యంలో న్యూజిలాండ్ .. 1991 స్థాయిలో దిగజారింది
న్యూజిలాండ్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 2024 సెప్టెంబర్ త్రైమాసికానికి దేశ జీడీపీ 1.2 శాతానికి పడిపోయింది. జీడీపీపై ప్రభావం చూపించే 16 ప్రధాన పరిశ్రమల్లో 11 పరిశ్రమలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా నిర్మాణ రంగం, వస్తు ఉత్పత్తి తయారీ రంగం, సేవల రంగాలకు చెందిన సంస్థలు ఆర్థికంగా సుదీర్ఘ నష్టాలను చవిచూస్తున్నాయి. కొన్ని వస్తు తయారీ కంపెనీలు రోజువారీ ఉత్పత్తిని సగానికి తగ్గించడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం
ఆర్థిక మాంద్యం కారణంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. పరిశ్రమలు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించుకోగా, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో కొత్త కంపెనీలు వస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో లాభాలు సాధించలేకపోయాయి. జీడీపీపై ప్రభావం చూపిన రంగాల్లో వ్యవసాయ రంగమే మాత్రం వృద్ధి సాధించింది. న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థలో ఇంతటి పతనం ఊహించని పరిణామమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ జీడీపీ వృద్ధిని 1.2 శాతంగా ప్రదర్శించడంతో ఆర్థిక నిపుణులు షాక్ అయ్యారు. తలసరి ఆదాయం తగ్గడంతో ప్రజల కొనుగోలు శక్తి మరింత క్షీణించింది.
రెండు త్రైమాసికాలుగా ఆర్థిక వ్యవస్థ నిరంతరం క్షీణిస్తోంది
గత రెండు త్రైమాసికాలుగా ఆర్థిక వ్యవస్థ నిరంతరం క్షీణిస్తోందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 1991 మాంద్యానికి సమానంగా జీడీపీ తగ్గిందని, తలసరి జీడీపీ కూడా గత రెండేళ్లుగా క్షీణిస్తున్నట్లు తెలిపారు. 2024 మూడవ త్రైమాసికానికి నిర్మాణ రంగం 2.8 శాతం, విద్యుత్ రంగం 3.7 శాతం, మైనింగ్ రంగం 2.2 శాతం క్షీణించినట్లు తేలింది.