Union Budget 2026: లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
ఈ వార్తాకథనం ఏంటి
సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ, అంతర్జాతీయ ఒత్తిడులను ఎదుర్కొనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను లోక్‌సభకు సమర్పించారు. స్వాతంత్య్రం తరువాత ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. బడ్జెట్‌కు ముందు, తన బృందంతో కలిసి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు చేరి ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతికి బడ్జెట్ పత్రాలు అందజేయడంతో సంప్రదాయానికి అనుగుణంగా మంత్రికి రాష్ట్రపతి మిఠాయి తినిపించారు. తర్వాత క్యాబినెట్ ఆమోదం పొందిన అనంతరం, నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Details
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తొమ్మిదోసారి
పవిత్ర మాఘపౌర్ణిమ రోజున బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాం. కర్తవ్య భవన్‌లో రూపొందించిన మూడో బడ్జెట్ ఇది. యువశక్తిని కేంద్రంగా తీసుకుని, భారత ఆర్థిక ప్రయాణాన్ని స్థిరంగా కొనసాగిస్తున్నాం. ప్రపంచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానిస్తూ, ప్రజల ఆకాంక్షలను కార్యరూపంలోకి తేవాలని లక్ష్యం. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకత ద్వారా భారత్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం. రైతులు, దళిత, గిరిజన సమూహాలకూ అభివృద్ధి ఫలాలు చేరాలని ఆమె తెలిపారు. రికార్డుల పరంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తొమ్మిదోసారి. స్వతంత్ర భారతంలో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మోరార్జీ దేశాయ్ 10 సార్లు చేశారు.
Details
మరో అరుదైన రికార్డు
మాజీ ఆర్థిక మంత్రి పీ.చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు, కానీ వరుసగా కాదు. ఇక నిర్మలా సీతారామన్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆర్థిక మంత్రిగా 2019 మే 31న బాధ్యతలు స్వీకరించిన ఆమె 2026 జనవరి 31 నాటికి 6 ఏళ్లు 8 నెలలు కొనసాగించారు. గతంలో సి.డి. దాస్ ముఖ్ ఆరేళ్ల రెండు నెలలపాటు నిరంతరాయంగా ఆర్థిక మంత్రిగా పని చేశారు.