LOADING...
Nirmala Seetharaman: బంగారం, వెండి దిగుమతులపై ఆందోళన లేదు: నిర్మలా సీతారామన్
బంగారం, వెండి దిగుమతులపై ఆందోళన లేదు: నిర్మలా సీతారామన్

Nirmala Seetharaman: బంగారం, వెండి దిగుమతులపై ఆందోళన లేదు: నిర్మలా సీతారామన్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో బంగారం,వెండి దిగుమతులు ప్రస్తుతం ఎలాంటి ఆందోళనకర స్థాయికి చేరలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈదిగుమతుల పరిస్థితిని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిరంతరం పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. అంతర్జాతీయంగా కేంద్రబ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం వల్లే ధరలు పెరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. బంగారం దిగుమతుల వల్ల కరెంట్ అకౌంట్ లోటు విషయంలో కూడా ఆందోళన అవసరం లేదని, అది నియంత్రణలోనే ఉందని వెల్లడించారు. సోమవారం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. బ్యాంకులు తమ ప్రధాన కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించాలని నిర్మలా సీతారామన్ సూచించారు. ముఖ్యంగా బీమా ఉత్పత్తులను తప్పుగా విక్రయించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

వివరాలు 

భారత్ సహా పలు దేశాలపై 15 శాతం సుంకాలు

భారత్ ఆర్థిక వృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని,ఈ ప్రయాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు. పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులను మరింత విస్తరించాలని కోరారు. ఈ సందర్భంగా అమెరికా విధిస్తున్న టారిఫ్‌ల అంశం కూడా చర్చకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై విధించిన సుంకాలను అక్కడి సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం భారత్ సహా పలు దేశాలపై 15 శాతం సుంకాలు అమలు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామాల వల్ల భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందనే ప్రశ్నకు సమాధానంగా, ఈ అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం దీనిపై స్పష్టమైన వ్యాఖ్య చేయడం సముచితం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

వివరాలు 

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌లో మోసంపై ఆర్‌బీఐ

హరియాణాలోని చండీగఢ్‌లో ఉన్న ఐడీఎ ఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ శాఖలో వెలుగుచూసిన రూ.590 కోట్ల మోసం ఘటనపై ఆర్‌బీఐ స్పందించింది. ఈ కేసును తాము సమగ్రంగా పరిశీలిస్తున్నామని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఇప్పటివరకు ఇది వ్యవస్థాత్మక మోసం అన్న సూచనలు కనిపించలేదని ఆయన వెల్లడించారు. హరియాణా ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన లావాదేవీల్లో బ్యాంక్ ఉద్యోగులు, ఇతరులు కలసి ఈ మోసానికి పాల్పడినట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement