Sundar Pichai: AI మార్కెట్ కూలితే.. మొత్తం టెక్ రంగం దెబ్బతింటుంది: సుందర్ పిచాయ్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్ ఒక్కసారిగా కూలిపోయే పరిస్థితి వస్తే "ఏ కంపెనీ కూడా దెబ్బ తినకుండా తప్పించుకోలదు" అని హెచ్చరించారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ దశను "అద్భుతమైన సమయం"గా అభివర్ణించినప్పటికీ, మార్కెట్‌లో కొంత "అతిగా ఉల్లాసం" కూడా కనిపిస్తోందని చెప్పారు. డాట్‌కామ్ కాలంలో ఎలా అతి ఉత్సాహం కనిపించిందో, ఇప్పుడూ అదే తరహా పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. AI మార్కెట్లో అవకతవకలు పెరిగినా, గూగుల్ ఎలా ఎదుర్కుంటుందన్న ప్రశ్నకు పిచాయ్, కంపెనీ బలం పట్ల నమ్మకంతో ఉన్నామని, కానీ "ఎవరూ రక్షితులుకాదు... మేము కూడా కాదు" అని స్పష్టం చేశారు.
వివరాలు
అమెరికా-బ్రిటన్ మార్కెట్లలో అస్థిరత
ఈ ఏడాది అల్ఫాబెట్ షేర్లు ఇప్పటికే 46% మేర పెరగడం, OpenAI-ChatGPTతో ఉన్న పోటీపై ఇన్వెస్టర్ల నమ్మకం పెరగడమే కారణంగా చెప్పబడుతోంది. మరోవైపు, AI విలువలు స్థిరంగా ఉంటాయన్న నమ్మకం తగ్గిపోవడంతో అమెరికా-బ్రిటన్ మార్కెట్లలో అస్థిరత పెరుగుతోంది. AI రంగంలో బబుల్ ప్రమాదాలపై బ్రిటిష్ పాలసీ మేకర్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో, సెప్టెంబర్‌లో అల్ఫాబెట్ యూకేలో కొత్త డేటా సెంటర్ కోసం £5 బిలియన్ల భారీ పెట్టుబడి ప్రకటించగా, లండన్‌లోని దీప్‌మైండ్‌కు మరింత నిధులు కేటాయించింది.
వివరాలు
AI మోడళ్లను బ్రిటన్‌లోనే ట్రైన్ చేయాలన్న గూగుల్ ప్లాన్
అలాగే AI మోడళ్లను బ్రిటన్‌లోనే ట్రైన్ చేయాలన్న గూగుల్ ప్లాన్‌ను పిచాయ్ వెల్లడించారు. దీని ద్వారా యూకే, అమెరికా-చైనా తరువాత ప్రపంచంలో మూడో అతిపెద్ద AI శక్తిగా ఎదగాలన్న లక్ష్యం ఉంచుకుంది. అయితే AIకి అవసరమైన ఎనర్జీ డిమాండ్ అతి భారీదని, దీనివల్ల అల్ఫాబెట్ నెట్-జీరో లక్ష్యాలు కొంత వెనక్కి జరగవచ్చని ఆయన అంగీకరించారు.