ONGC: వెనెజువెలా చమురు తిరిగొస్తుందా? భారత కంపెనీలకు బకాయిల మోక్షం!
ఈ వార్తాకథనం ఏంటి
వెనెజువెలా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుని, ఆ దేశ చమురు రంగంపై అమెరికా పట్టు సాధిస్తున్న పరిస్థితుల్లో, దీని ప్రభావం భారత చమురు రంగంపై ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. ఈ పరిణామం వల్ల మన దేశానికి లాభమా, లేక కొత్త సవాళ్లా అనే అంశంపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ మార్పుల వల్ల భారతీయ చమురు సంస్థలకు మేలు చేకూరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా వెనెజువెలా నుంచి రావాల్సిన భారీ బకాయిలు తిరిగి వసూలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
వెనెజువెలా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో భారత్ ముందంజ
అమెరికా వెనెజువెలా చమురు రంగాన్ని టేకోవర్ చేయడం లేదా పునర్వ్యవస్థీకరించడం జరిగితే, భారత్‌కు రావాల్సిన సుమారు 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9,000 కోట్లు) బకాయిలకు దారి తెరచుకునే అవకాశముంది. అంతేకాదు, వెనెజువెలాలో భారత సంస్థలు నిర్వహిస్తున్న చమురు క్షేత్రాల్లో ఉత్పత్తి పెరిగే పరిస్థితులు ఏర్పడతాయని అంచనా. ఒకప్పుడు వెనెజువెలా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉండేది. రోజుకు 4 లక్షల బ్యారెళ్లకు మించి చమురును అక్కడి నుంచి కొనుగోలు చేసింది. అయితే, 2020లో అమెరికా ఆంక్షలు తీవ్రతరం కావడం, నియంత్రణ అడ్డంకులు పెరగడంతో భారత్ ఆ దేశం నుంచి చమురు దిగుమతులను నిలిపివేసింది.
వివరాలు
ఓఎన్‌జీసీ విదేశ్‌కు సానుకూలం
తూర్పు వెనెజువెలాలోని శాన్ క్రిస్టోబల్ చమురు క్షేత్రాన్ని ఓఎన్‌జీసీ విదేశ్ సంయుక్తంగా నిర్వహిస్తోంది. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా అవసరమైన ఆధునిక సాంకేతికత, పరికరాలు, సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. భారీ నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని సమర్థంగా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్షేత్రంలో 40 శాతం వాటా కలిగిన ఓఎన్‌జీసీ విదేశ్‌కు 2014 వరకు చెల్లించాల్సిన 536 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,800 కోట్లు) డివిడెండ్లను వెనెజువెలా చెల్లించలేదు. ఆ తర్వాత కూడా ఇదే మొత్తానికి సంబంధించిన ఆడిట్‌లకు అనుమతి ఇవ్వకపోవడంతో, క్లెయిమ్‌ల పరిష్కారం నిలిచిపోయింది.
వివరాలు
ఉత్పత్తి 10 రెట్లు పెరిగే అవకాశం
అమెరికా ఆంక్షలు సడలితే, గుజరాత్‌లోని ఓఎన్‌జీసీకి చెందిన చమురు క్షేత్రాల నుంచి రిగ్‌లు, ఇతర పరికరాలను శాన్ క్రిస్టోబల్‌కు తరలించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రస్తుతం రోజుకు 5,000 నుంచి 10,000 బ్యారెళ్లకు పరిమితమైన ఉత్పత్తిని దాదాపు 10 రెట్ల వరకు పెంచవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
వెనెజువెలా చమురు మళ్లీ ప్రపంచ మార్కెట్‌కు
అమెరికా పర్యవేక్షణలో వెనెజువెలా నుంచి మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లకు చమురుఎగుమతులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాన్ క్రిస్టోబల్ ప్రాజెక్ట్ నుంచి ఓఎన్‌జీసీ విదేశ్‌కు రావాల్సిన సుమారు 1బిలియన్ డాలర్ల బకాయిలు కూడా వసూలయ్యే వీలుంది. చెవ్రాన్‌కు ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్‌ఏసీ) ఇచ్చిన అనుమతుల తరహాలో,'ప్రత్యేక లైసెన్స్'ద్వారా ఆంక్షల మినహాయింపులు ఇవ్వాలని ఓఎన్‌జీసీ విదేశ్ కోరుతోంది. అదేవిధంగా,వెనెజువెలాలోని మరిన్ని చమురు క్షేత్రాలను ఓఎన్‌జీసీ విదేశ్‌తో పాటు ఇతర భారత సంస్థలు స్వీకరించి,కారాబోబో-1 ప్రాంతంలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఈప్రాజెక్ట్‌లో ఓఎన్‌జీసీకి 11 శాతం,ఐఓసీకి 3.5 శాతం,ఆయిల్ ఇండియాకు 3.5శాతం వాటాలు ఉన్నాయి. శాన్ క్రిస్టోబల్,కారాబోబో-1 ప్రాజెక్టుల్లో వెనెజువెలా ప్రభుత్వ చమురు సంస్థ పీడీవీఎస్‌ఏ మెజారిటీ వాటాదారుగా ఉంది.
వివరాలు
భారత వాణిజ్యంపై పెద్ద ప్రభావం లేదు
అమెరికా-వెనెజువెలా పరిణామాల వల్ల భారత వాణిజ్యంపై పెద్దగా ప్రభావం ఉండదని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) స్పష్టం చేసింది. ఆంక్షల అనంతరం వెనెజువెలాతో భారత వాణిజ్యం భారీగా తగ్గిందని సంస్థ పేర్కొంది. 2024-25లో ముడిచమురు దిగుమతులు 81.3 శాతం వరకు పడిపోయాయని, ద్వైపాక్షిక వాణిజ్యం కూడా పరిమితంగానే కొనసాగుతోందని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం స్వల్పంగానే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2024-25లో వెనెజువెలా నుంచి భారత్ దిగుమతులు కేవలం 364.5 మిలియన్ డాలర్లు (రూ.3,280 కోట్లు) మాత్రమే ఉండగా, భారత్ నుంచి ఎగుమతులు 95.3 మిలియన్ డాలర్లు (రూ.850 కోట్లు)గా నమోదయ్యాయి.
వివరాలు
ఉచిత స్టార్‌లింక్ ఇంటర్నెట్
సంక్షోభంలో ఉన్న వెనెజువెలా ప్రజలకు శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను ఉచితంగా అందించనున్నట్లు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ప్రకటించింది. ఫిబ్రవరి 3 వరకు ఈ ఉచిత సేవలు కొనసాగుతాయని మస్క్ వెల్లడించారు.
వివరాలు
ముందున్న దారేంటి?
అమెరికా చర్యల నేపథ్యంలో పీడీవీఎస్‌ఏ పునర్‌వ్యవస్థీకరణ జరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఆ సంస్థలోని వాటాను అమెరికా కంపెనీలు లేదా కొత్త సంస్థలు స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. వెనెజువెలాకు అమెరికా ప్రధాన చమురు కంపెనీలు తిరిగి రానున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, అన్ని అంతర్జాతీయ కంపెనీల స్థానాన్ని అమెరికా సంస్థలు భర్తీ చేయలేవన్నది నిపుణుల అభిప్రాయం. అనుభవం, సాంకేతిక నైపుణ్యం ఉన్న ఓఎన్‌జీసీ విదేశ్ వంటి సంస్థలు అమెరికాకు కూడా అవసరమవుతాయి. అమెరికా సహా ఇతర అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో వెనెజువెలా తన పాత చమురు వైభవాన్ని తిరిగి సాధించే అవకాశం ఉందని అంచనా.
వివరాలు
ముందున్న దారేంటి?
వెనెజువెలా నుంచి వచ్చే భారీ చమురును శుద్ధి చేసే సామర్థ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ, ఐఓసీ, హెచ్‌పీసీఎల్-మిత్తల్ ఎనర్జీ, మంగళూరు రిఫైనరీ వంటి భారతీయ సంస్థలకు ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్-అమెరికా వాణిజ్య చర్చల నేపథ్యంలో, రష్యాపై ఆధారాన్ని తగ్గించి, ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులు పెంచుకునే అవకాశం భారత్‌కు లభించనుంది. వెనెజువెలా ఎగుమతులు తిరిగి ప్రారంభమైతే అంతర్జాతీయ చమురు ధరల్లో స్థిరత్వం రావడంతో పాటు, ఒపెక్ ఉత్పత్తిని సర్దుబాటు చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.