UIDAI: ఆధార్ ఫోటోకాపీలకు గుడ్‌బై… UIDAI కొత్త నిబంధనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆధార్ ఫోటోకాపీలకు ఇక చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు,ఈవెంట్ నిర్వాహకులు వంటి సంస్థలు ఆధార్ కార్డు భౌతిక ప్రతులు తీసుకుని నిల్వ చేయడాన్ని పూర్తిగా ఆపేలా త్వరలోనే కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆధార్ చట్టానికి విరుద్ధంగా సాగుతున్న కాగితాల మీద ఆధారపడిన వెరిఫికేషన్ విధానాన్ని నిలిపివేయడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇకపై ఆఫ్‌లైన్ ఆధార్ వెరిఫికేషన్ చేయాలనుకునే అన్ని సంస్థలు UIDAI వద్ద తప్పనిసరిగా నమోదు కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత మాత్రమే సెక్యూర్ API ద్వారా QR కోడ్, యాప్ ఆధారిత డిజిటల్ ధృవీకరణ విధానాన్ని ఉపయోగించుకోవాలి.
వివరాలు
సదుపాయాలు
దీంతో ఫోటోకాపీల సేకరణ పూర్తిగా ఆగిపోతుంది. ఇప్పటికే ఈ నిబంధనకు UIDAI ఆమోదం తెలిపిందని, త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల అవుతుందని UIDAI సీఈఓ భువనేశ్ కుమార్ తెలిపారు. ఇదే సమయంలో కొత్త ఆధార్ యాప్‌ను UIDAI పరీక్షిస్తోంది. ఈ యాప్ ద్వారా కేంద్ర డేటాబేస్‌కు ప్రతి సారి నేరుగా కనెక్ట్ కాకుండానే, యాప్‌తో యాప్ వెరిఫికేషన్ చేయవచ్చని తెలిపారు. విమానాశ్రయాలు, వయస్సు పరిమితి ఉన్న ఉత్పత్తులు విక్రయించే దుకాణాలు, ఈవెంట్ వేదికల వద్ద ఈ విధానం ఉపయోగంలోకి రానుంది. అలాగే ఇందులో అడ్రస్ ప్రూఫ్ అప్డేట్ చేయడం, మొబైల్ లేని కుటుంబ సభ్యులను జోడించడం వంటి సదుపాయాలు కూడా ఉండనున్నాయి.
వివరాలు
18 నెలల్లో పూర్తిగా అమలుకాబోయే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం
మధ్యవర్తి సర్వర్లు పనిచేయని సమయంలో ఏర్పడే ఇబ్బందులను కూడా ఈ విధానం తగ్గిస్తుందని, QR కోడ్, యాప్ ఆధారిత ఆఫ్‌లైన్ ధృవీకరణ వల్ల సేవల్లో అంతరాయం ఉండదని UIDAI స్పష్టం చేసింది. కాగితాల నిల్వ అవసరం లేకుండా చేయడం ద్వారా గోప్యత మరింత బలోపేతం అవుతుందని, ఆధార్ దుర్వినియోగ అవకాశాలు తగ్గుతాయని అధికారులు చెప్పారు. రానున్న 18 నెలల్లో పూర్తిగా అమలుకాబోయే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థ పనిచేయనుందని UIDAI వెల్లడించింది.