Loading...
LTCG Tax: ఎల్‌టీసీజీ ట్యాక్స్‌ కొనసాగుతుంది.. రద్దుపై ఎలాంటి ఆలోచన లేదన్న కేంద్రం
ఎల్‌టీసీజీ ట్యాక్స్‌ కొనసాగుతుంది.. రద్దుపై ఎలాంటి ఆలోచన లేదన్న కేంద్రం

LTCG Tax: ఎల్‌టీసీజీ ట్యాక్స్‌ కొనసాగుతుంది.. రద్దుపై ఎలాంటి ఆలోచన లేదన్న కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)ను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, అలాంటి నిర్ణయంపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పన్ను విధానాలు, మూలధన లాభాల పన్ను రేట్లను బడ్జెట్ ప్రక్రియలో భాగంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని తెలిపింది. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ప్రస్తుతం ఎల్‌టీసీజీ పన్నును తొలగించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. అవసరానికి అనుగుణంగా పన్ను విధానాలపై సమీక్ష కొనసాగుతుందని వివరించారు.

వివరాలు 

ఎల్‌టీసీజీ పన్ను ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం

ఎల్‌టీసీజీ పన్ను ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

2024-25 మదింపు సంవత్సరంలో రూ.72,249 కోట్ల పన్ను వసూలు కాగా, 2025-26 మదింపు సంవత్సరంలో అది 78 శాతం పెరిగి రూ.1,29,158 కోట్లకు చేరిందన్నారు.

ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి మూలధన లాభాల పన్ను రూపంలో ప్రభుత్వానికి సుమారు రూ.2.01 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

ప్రస్తుతం దేశీయ పెట్టుబడిదారులు షేర్లు లేదా మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను 12 నెలలకు మించి కలిగి ఉంటే వాటిని దీర్ఘకాలిక ఆస్తులుగా పరిగణిస్తారు.

అలాంటి పెట్టుబడుల ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన లాభం పొందిన భాగంపై 12.5 శాతం ఎల్‌టీసీజీ పన్ను వర్తిస్తుంది.

వివరాలు 

విదేశీ పెట్టుబడిదారులకు కూడా దేశీయ మదుపర్లకు వర్తించే నిబంధనలే..

ఇదిలా ఉండగా, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐలు) భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకున్న నేపథ్యంలో కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులపై వర్తించే దీర్ఘకాల మూలధన లాభాల పన్నును పూర్తిగా మినహాయిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

అయితే ఈక్విటీ పెట్టుబడుల విషయంలో మాత్రం విదేశీ పెట్టుబడిదారులకు కూడా దేశీయ మదుపర్లకు వర్తించే నిబంధనలే అమల్లో ఉంటాయి.

అందువల్ల ఈక్విటీలపై లభించే దీర్ఘకాల మూలధన లాభాలకు 12.5 శాతం ఎల్‌టీసీజీ పన్ను చెల్లించాల్సిందే.

ADVERTISEMENT