Electric Vehicle Policy: 2028 నుంచి పెట్రోల్ బైక్లకు నో.. ఈవీలకే గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో 2026-30 కాలానికి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికిల్ (EV) ముసాయిదా పాలసీని తాజాగా విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారం 2027 జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ వాహనాల రిజిస్ట్రేషన్కే అనుమతి ఉంటుంది. ఆ తర్వాత టూ-వీలర్లను కూడా ఈ జాబితాలో చేర్చనున్నారు. 2028 ఏప్రిల్ 1 నుంచి ఎలక్ట్రిక్ మోడళ్ల రిజిస్ట్రేషన్ మాత్రమే అనుమతించాలనే ప్రతిపాదన ఉంది. నగరంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను దశలవారీగా తగ్గించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
వివరాలు
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహాకాలు
ప్రజలను ఈవీల కొనుగోళ్ల వైపు మళ్లించేందుకు పలు ప్రోత్సాహకాలను దిల్లీ రవాణా శాఖ ప్రతిపాదించింది. రూ.2.25 లక్షల విలువ గల ఎలక్ట్రిక్ టూ-వీలర్ కొనుగోలు చేస్తే, ఒక్కో కిలోవాట్ అవర్కు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రోత్సాహకం అందించనున్నారు. అలాగే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు తొలి ఏడాది రూ.50 వేల ప్రోత్సాహకం లభించనుండగా, ఆ తర్వాత ఈ మొత్తం క్రమంగా తగ్గనుంది. పాత వాహనాలను తుక్కు చేసి ఎలక్ట్రిక్ వాహనాలకు మారిన వారికి కూడా ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. అంతేకాకుండా, ఈవీల వినియోగాన్ని పెంచేందుకు ఛార్జింగ్ సౌకర్యాలను నగరవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనలను ప్రజాభిప్రాయం కోసం 30 రోజుల పాటు అందుబాటులో ఉంచారు.
వివరాలు
శీతాకాలంలో దిల్లీలో తీవ్రమైన కాలుష్య సమస్య
వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది పాలసీకి రూపురేఖలు సిద్ధం చేయనున్నారు. ప్రతి ఏడాది శీతాకాలంలో దిల్లీ తీవ్రమైన కాలుష్య సమస్యను ఎదుర్కొంటోంది. దీంతో ప్రజలు శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.