LOADING...
USA- Iran: అమెరికాపై అనుమానం.. పాక్‌కు చేరిన ఇరాన్ ప్రతినిధులు, చర్చలకు షరతులు
అమెరికాపై అనుమానం.. పాక్‌కు చేరిన ఇరాన్ ప్రతినిధులు, చర్చలకు షరతులు

USA- Iran: అమెరికాపై అనుమానం.. పాక్‌కు చేరిన ఇరాన్ ప్రతినిధులు, చర్చలకు షరతులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో జరగబోయే అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు సంబంధించి నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఇరాన్ ప్రతినిధి బృందం శుక్రవారం ఇస్లామాబాద్ చేరుకుంది. వీరికి పాక్ అధికారులు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రతినిధి బృందానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు. రక్షణ శాఖ కీలక అధికారులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌తో పాటు పలువురు సీనియర్ రాజకీయ, సైనిక ప్రతినిధులు కూడా ఈ బృందంలో ఉన్నారు. అయితే ముందస్తు షరతులకు అమెరికా అంగీకరిస్తేనే చర్చలు కొనసాగుతాయని ఇరాన్ మీడియా స్పష్టం చేసింది.

Details

రెండు విమానాలు ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్

ఫ్లైట్‌రాడర్24 వివరాల ప్రకారం, ఇరాన్ ప్రభుత్వానికి చెందిన రెండు విమానాలు ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తదితరులు ఇరాన్ ప్రతినిధులకు స్వాగతం పలికినట్లు వెల్లడించింది. అయితే చర్చలు ముందుకు సాగేందుకు ఇరాన్ కొన్ని కీలక షరతులు విధించింది. ఏ కాల్పుల విరమణ జరిగినా లెబనాన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అలాగే ఆంక్షల కారణంగా స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే చర్చలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది.

Details

పూర్తి నమ్మకం లేదు

ఇదిలా ఉండగా, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాపై తమకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ పూర్తి నమ్మకం లేదని తెలిపారు. గతంలో చర్చలు కొనసాగుతున్న సమయంలోనే తమపై దాడులు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. తమ ప్రజల హక్కులను అమెరికా గౌరవిస్తే ఒప్పందానికి సిద్ధమని, కానీ చర్చలను కేవలం ప్రచారంగా మలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇక ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లెబనాన్-ఇజ్రాయెల్ దేశాల రాయబారులు ఫోన్‌లో చర్చించారు. కాల్పుల విరమణ, శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఈ సంభాషణ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నెల 14న అధికారిక సమావేశం నిర్వహించేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు సమాచారం.

Advertisement