Nokia layoffs: నోకియా షాకింగ్ నిర్ణయం.. భారత్‌లో లేఆఫ్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ స్థాయి పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ప్రముఖ టెలికాం కంపెనీ 'నోకియా' మనదేశంలోనూ కొందరు ఉద్యోగులను లేఆఫ్ చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం. 2026లో పునర్వ్యవస్థీకరణ చేపడతామని సంస్థ గతేడాది నవంబరులో ప్రకటించింది. ఈ ప్రణాళికలో భాగంగా కంపెనీ నిర్మాణాన్ని సరళీకరించనున్నారు. ముఖ్యంగా సంస్థను నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మొబైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే రెండు ప్రధాన విభాగాలుగా విభజించనున్నారు. మిగతా వ్యాపార విభాగాలను పెట్టుబడుల ఉపసంహరణ లేదా సమీక్ష కోసం విడదీయాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా నోకియాలో ప్రస్తుతం సుమారు 74,100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 20 శాతం వరకు కోతలు ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ఈ ఏడాది ఉద్యోగ కోతలు ఉండే అవకాశం
ఇదే ధోరణి భారత్‌లోనూ కొనసాగవచ్చని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. ఇక కంపెనీ నాయకత్వంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నోకియా ఇండియా కంట్రీ హెడ్‌గా ఉన్న తరుణ్ చాబ్రా నిష్క్రమణ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి సమర్ మిత్తల్ ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్‌గా విభా మెహ్రా ఇండియా కంట్రీ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని నోకియా సీఈఓ జస్టిన్ హోటర్డ్ ప్రకటించారు. భారత్‌లో నోకియా శాశ్వత ఉద్యోగుల సంఖ్య 2024లో 17,270గా ఉండగా, గతేడాది అది 17,708కు పెరిగింది. అయితే ప్రస్తుత పునర్నిర్మాణ చర్యల నేపథ్యంలో ఈ ఏడాది ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.