Domino's: కేవలం 20 నిమిషాల్లోనే డెలవరీ.. ధ్రువీకరించిన డొమినోస్
జ్యూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ తమ డెలివరీ సమయాన్ని 30 నిమిషాల నుంచి 20 నిమిషాలకు తగ్గించడానికి ప్రణాళికలు రూపొందించింది. క్విక్ ఈ-కామర్స్ కంపెనీల ప్రభావం, వినియోగదారుల్లో వచ్చిన మార్పుల కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. డొమినోస్ పిజ్జా ఇండియా ఫ్రాంచైజీ ఆపరేటర్ అయిన ఈ సంస్థ, నవంబర్ 11, 2024, సోమవారం జరిగిన కంపెనీ ఈక్విటీ కాల్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఫాస్ట్ డెలివరీపై వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో డెలివరీ వేగంపై జ్యూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ దృష్టి సారించింది. క్విక్ కామర్స్ విస్తరణతో కేవలం గ్రోసరీలు మాత్రమే కాకుండా, ఇతర డెలివరీ రంగాల్లోనూ వేగంగా సేవలు అందించే సంస్థలు ముందుకు వస్తున్నాయి.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అధిక అర్డర్లు
ఆర్డర్లు క్రమంగా పెరుగుతున్నాయని జ్యూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ వెల్లడించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అధిక ఆర్డర్లు వస్తున్నట్లు తెలిపింది. కంపెనీ గత తొమ్మిది త్రైమాసికాలుగా ధరలను స్థిరంగా ఉంచడంలో విజయం సాధించినట్టు తెలిపింది. ద్వితీయ త్రైమాసికంలో, జ్యూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ 2.8% అమ్మకాలు అధికమయ్యాయి. ఇది డెలివరీ విభాగంలో 11.4% వృద్ధిని సూచిస్తోంది. కంపెనీ 73 స్టోర్లను అదనంగా జోడించి 3,130 స్టోర్లకు విస్తరించింది. మొత్తం ఆదాయం రూ.1,954.7 కోట్లకు చేరుకుంది. ఇది గతేడాది ఇదే త్రైమాసికం నుంచి 43% వృద్ధి కావడం విశేషం. అమెరికన్ ఫ్రైడ్ చికెన్ చైన్ పోపాయ్స్, డంకిన్ డోనట్స్‌లను కూడా భారతదేశంలోకి తీసుకురావడానికి జ్యూబిలెంట్ ప్రయత్నిస్తోంది.