LOADING...
New UPI rule: యూపీఐ సేవల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఎన్‌పీసీఐ కీలక నిర్ణయాలు!
యూపీఐ సేవల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఎన్‌పీసీఐ కీలక నిర్ణయాలు!

New UPI rule: యూపీఐ సేవల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఎన్‌పీసీఐ కీలక నిర్ణయాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2025
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మకంగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులు ముఖ్యంగా బ్యాలెన్స్ తనిఖీ, ఆటో పేమెంట్‌ లావాదేవీలపై ప్రభావం చూపనున్నాయి. యూపీఐ సేవలపై ఉన్న అధిక ఒత్తిడిని తగ్గిస్తూ వినియోగదారులకు మరింత స్థిరమైన సేవలందించడమే లక్ష్యంగా ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

Details

రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకునే అవకాశం

ఇప్పటివరకు యూపీఐ యాప్‌లలో బ్యాలెన్స్ తనిఖీకి ఎలాంటి పరిమితి లేకుండా వినియోగదారులు పదే పదే చెక్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు నుంచి దీనికి పరిమితి విధించనున్నారు. రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయడానికి అనుమతించనున్నారు. అంతేకాదు, ఒకే మొబైల్ నంబర్‌తో అనుసంధానించబడ్డ బ్యాంకు ఖాతాల సంఖ్య ఆధారంగా గరిష్ఠంగా 25 సార్ల వరకే బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం అనవసర API కాల్స్‌ వల్ల సర్వర్లు అధికంగా బిజీ అవుతున్నాయని గుర్తించిన NPCI, వాటి ప్రభావంతో సేవలలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని అర్థం చేసుకుంది. అందుకే ఈ పరిమితులను అమలులోకి తీసుకువస్తోంది.

Details

ఆటోపేమెంట్‌ లావాదేవీల్లో టైమింగ్ కీలకం

యూపీఐ ఆధారిత ఆటోపేమెంట్ వ్యవస్థలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎప్పుడు కావాలన్నా సంస్థలు ఆటో డెబిట్ రిక్వెస్ట్‌లు పంపగలిగే విధంగా ఉండేది. ఇకపై ఈ రిక్వెస్ట్‌లను రద్దీ లేని సమయంలో మాత్రమే షెడ్యూల్ చేయాలని ఎన్‌పీసీఐ సూచించింది. దీనివల్ల రాత్రివేళలు లేదా ట్రాన్సాక్షన్ ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయంలో ఆటోపేమెంట్లు ప్రాసెస్ చేయబడతాయి. ఈ మార్పు ప్రధానంగా యుటిలిటీ బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు, ఈఎంఐలు వంటి సేవలపై ప్రభావం చూపుతుంది. అయితే వినియోగదారులచే హస్తచర్యతో జరిగే చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదు.

Details

వినియోగదారులపై ప్రభావం ఎంత?

NPCI లెక్కల ప్రకారం యూపీఐ ద్వారా నెలకు రూ.1800 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి.గత ఏప్రిల్, మే నెలల్లో పలు సందర్భాల్లో UPI సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇందుకు కారణం వినియోగదారులే కాకుండా సంస్థలచే తరచూ జరిపే API కాల్స్ అని గుర్తించారు.తాజా మార్పుల ద్వారా ఈ పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి, సాధారణ వినియోగదారులకు ఈపరిమితులు పెద్దగా చికాకులు కలిగించవు. ఎందుకంటే రోజులో 50 సార్లు బ్యాలెన్స్ చెక్ చేయడం అనేది చాలా అరుదైన అంశం. కానీ, పెద్ద సంస్థలు, ఆర్థిక సేవా యాప్స్ ఉపయోగించే యూజర్లకు మాత్రం ఇది గమనించదగ్గ మార్పు. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి ప్రముఖ యూపీఐ యాప్‌లు ఉపయోగించేవారందరికీ ఈ మార్పులు వర్తించనున్నాయి.