Loading...
NSE: ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్ఎస్ఈ.. సరికొత్త రికార్డు!
ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్ఎస్ఈ.. సరికొత్త రికార్డు!

NSE: ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్ఎస్ఈ.. సరికొత్త రికార్డు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పబ్లిక్ లిస్టెడ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్‌గా అవతరించింది. గురువారం (నవంబర్ 26) బీఎస్ఈలో ఎన్ఎస్ఈ షేరు ధర జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరడంతో ఈ ఘనత సాధించింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ సుమారు 64.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.5.94 లక్షల కోట్లు) చేరింది. ఈ క్రమంలో ఐరోపాకు చెందిన ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ సంస్థలు డాయిష్ బోర్స్ (63.4 బిలియన్ డాలర్లు), లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ (62.4 బిలియన్ డాలర్లు)లను ఎన్ఎస్ఈ వెనక్కి నెట్టింది.

వివరాలు 

ఎన్ఎస్ఈ కంటే ముందు రెండు స్టాక్ ఎక్స్ఛేంజ్ సంస్థలు

ఇటీవల నవంబర్ 20న నాస్‌డాక్ (59.4 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ ఎక్స్ఛేంజ్ (57.1 బిలియన్ డాలర్లు)లను అధిగమించి ప్రపంచంలో ఐదో స్థానానికి చేరిన ఎన్ఎస్ఈ.. వారం రోజులు గడవకముందే మూడో స్థానానికి ఎగబాకడం విశేషం.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు స్టాక్ ఎక్స్ఛేంజ్ సంస్థలు మాత్రమే ఎన్ఎస్ఈ కంటే ముందున్నాయి.

అమెరికాకు చెందిన CME గ్రూప్ 111.6 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో ఉండగా, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాతృసంస్థ ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ 99.4 బిలియన్ డాలర్ల విలువతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

వివరాలు 

రెండు నెలల్లోనే భారీ లాభాలు.. దేశంలో 9వ అతిపెద్ద కంపెనీగా..

2026 సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఈ షేర్లు బీఎస్ఈలో ఒక్కోటి రూ.1,785 ఇష్యూ ధరతో లిస్ట్ అయ్యాయి.

అప్పటి నుంచి షేరు ధరలో గణనీయమైన పెరుగుదల నమోదైంది.

గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.2,400గరిష్ఠ స్థాయిని తాకింది.

దీంతో లిస్టింగ్ ధరతో పోలిస్తే 30శాతానికి పైగా లాభాలను అందించింది.

అక్టోబర్ నెలలోనే ఈ స్టాక్ 34శాతం పెరిగింది. ఇక నవంబర్‌లో ఇప్పటివరకు జరిగిన 18 ట్రేడింగ్ సెషన్లలో 14రోజులు లాభాలతో ముగిసింది.

ఈ భారీ ర్యాలీతో ఎన్ఎస్ఈ మార్కెట్ విలువ మరింత పెరిగింది.

దేశీయంగా ప్రముఖ సంస్థలైన లార్సెన్ అండ్ టూబ్రో (L&T), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)లను సైతం అధిగమించింది.

దీంతో భారత స్టాక్ మార్కెట్లో తొమ్మిదో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా నిలిచింది.

ADVERTISEMENT

వివరాలు 

నిపుణులు ఏమంటున్నారు?

వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ఛేంజీల గణాంకాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ క్యాష్ ఈక్విటీ ట్రేడింగ్‌లో ఎన్ఎస్ఈ 11.4 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది.

ఈక్విటీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ట్రేడింగ్‌లో ఏకంగా 51.2 శాతం వాటాను సొంతం చేసుకుంది.

అంతేకాకుండా 66.9 శాతం ఆపరేటింగ్ EBITDA మార్జిన్‌తో ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా కొనసాగుతోంది.

అయితే ఎన్ఎస్ఈ షేర్ల ధర పెరుగుదలపై బ్రోకరేజీ సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

డెరివేటివ్స్ విభాగంలో నియంత్రణపరమైన ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో సంస్థ ఆదాయ వృద్ధి వేగవంతమవుతుందని జెఫరీస్ అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈ షేర్లకు 'బై' రేటింగ్‌ను కొనసాగించింది.

ADVERTISEMENT

వివరాలు 

నిపుణులు ఏమంటున్నారు?

మరోవైపు 2027 ఫిబ్రవరిలో వెలువడే ప్రకటనలో ఎన్ఎస్ఈకి ఎంఎస్‌సీఐ ఇండియా స్టాండర్డ్ ఇండెక్స్‌లో చోటు దక్కే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ అభిప్రాయపడింది.

అయితే హెచ్‌ఎస్‌బీసీ మాత్రం భిన్నమైన అంచనాను వెల్లడించింది.

మొత్తం 17 మంది విశ్లేషకులు ఎన్ఎస్ఈ షేర్లకు 'బై' రేటింగ్ ఇస్తుండగా.. హెచ్‌ఎస్‌బీసీ గురువారం రూ.2,300 టార్గెట్ ప్రైస్‌తో 'హోల్డ్' రేటింగ్ ఇచ్చింది.

ప్రస్తుత షేరు ధరలో సంస్థకు సంబంధించిన సానుకూల అంశాలన్నీ ఇప్పటికే ప్రతిబింబిస్తున్నాయని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది.

అంటే షేరు విలువ ప్రస్తుతం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుందని, ఇకపై మరింత పెరిగే అవకాశాలను జాగ్రత్తగా అంచనా వేయాలని సూచించింది.

దీంతో ఎన్ఎస్ఈ షేర్ల భవిష్యత్ కదలికలపై ఇన్వెస్టర్ల దృష్టి నెలకొంది.

ADVERTISEMENT