LOADING...
Oil price jumps: పశ్చిమాసియా సంక్షోభం.. 10% పెరిగిన చమురు ధరలు
పశ్చిమాసియా సంక్షోభం.. 10% పెరిగిన చమురు ధరలు

Oil price jumps: పశ్చిమాసియా సంక్షోభం.. 10% పెరిగిన చమురు ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలక కేంద్రంగా ఉన్న హర్ముజ్‌ జలసంధి (Strait of Hormuz)లో నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడంతో గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా 10 శాతం వరకు ఎగసిపడ్డాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభమైన వెంటనే ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్‌లో బ్రెంట్ క్రూడ్‌ ఏప్రిల్ కాంట్రాక్ట్ బ్యారెల్‌కు 10 శాతం పెరిగి 81.87 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ 13 శాతం ఎగబాకి 82.37 డాలర్లకు చేరింది. ఇది 2025 జనవరి తర్వాత నమోదైన అత్యధిక ధరగా నిలిచింది. ఆదివారం ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణులు ప్రయోగించిన విషయం తెలిసిందే.

వివరాలు 

ప్రపంచ చమురులో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే..

గల్ఫ్ తీర ప్రాంతంలో మూడు చమురు ట్యాంకర్లను దెబ్బతీశామని ఇరాన్ అధికారులు ప్రకటించారు. దీంతో చమురు రవాణా అంతరాయం కలగవచ్చన్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఒమన్,ఇరాన్ మధ్య ఇరుకైన సముద్ర మార్గమే హర్ముజ్ జలసంధి. సౌదీ అరేబియా,యూఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి ఇతర దేశాలకు సరఫరా అయ్యే ప్రపంచ చమురులో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే వెళ్తోంది. అలాగే ప్రపంచ వినియోగంలో ఉన్న ద్రవరూప సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)లో కూడా దాదాపు 20 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది.

వివరాలు 

చమురు వినియోగదారులలో భారత్ మూడో స్థానం

ఇలాంటి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సందర్భాల్లో భారత ఇంధన అవసరాలను తీర్చేందుకు దేశంలో ఉన్న వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు 74 రోజుల వరకు సరిపోతాయని గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పురి వెల్లడించారు. ప్రపంచంలో అతిపెద్ద చమురు వినియోగదారులలో భారత్ మూడో స్థానంలో ఉంది. రోజుకు సుమారు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తోంది. అందులో 1.5 నుంచి 2 మిలియన్ బ్యారెళ్ల వరకు హర్ముజ్ జలసంధి మార్గం ద్వారానే భారత్‌కు చేరుతున్నాయి. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గిన నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు భారత్‌కు ప్రధాన ప్రత్యామ్నాయ వనరుగా మారాయి.

Advertisement

వివరాలు 

రూ.13 వేల కోట్ల అదనపు భారం

బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు ఒక్క డాలర్ పెరిగినా, ఏడాదికి కేంద్ర ప్రభుత్వంపై సుమారు రూ.13 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. గత సంవత్సరం భారత్ సుమారు 160 బిలియన్ డాలర్ల విలువైన చమురును దిగుమతి చేసుకుంది.

Advertisement