LOADING...
Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 95 డాలర్ల స్థాయి దిగువకు క్రూడాయిల్ ధరలు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 95 డాలర్ల స్థాయి దిగువకు క్రూడాయిల్ ధరలు

Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 95 డాలర్ల స్థాయి దిగువకు క్రూడాయిల్ ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ భయాలు తగ్గుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు వరుసగా రెండో రోజు పడిపోయాయి. ఈ రెండు దేశాల మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇటీవల మూసివేసిన హోర్ముజ్ జలసంధి కారణంగా సరఫరాలో వచ్చిన అంతరాయం కొంత తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,రెండు రోజుల్లో పాకిస్థాన్‌లో చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశముందని సంకేతాలు ఇవ్వడంతో మార్కెట్లలో కొంత ఊరట కనిపించింది. బుధవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 52సెంట్లు లేదా 0.55శాతం పడిపోయి 94.27 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 1.04 డాలర్లు లేదా 1.1 శాతం తగ్గి 90.24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

ఉద్రిక్తతలు తగ్గినా చమురు ధరలు 85 నుంచి 90 డాలర్ల మధ్య ఉండే అవకాశం

గల్ఫ్ ప్రాంతం నుంచి ఆసియా, యూరప్ మార్కెట్లకు చమురు సరఫరా చేసే కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల సరఫరా వ్యవస్థ ఇప్పటికీ దెబ్బతింది. అయితే చర్చలు జరిగే సూచనలు ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదని నిపుణులు చెబుతున్నారు. మాక్వెరి సంస్థ అంచనా ప్రకారం ఉద్రిక్తతలు తగ్గినా చమురు ధరలు 85 నుంచి 90 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ వరకూ అంతరాయం కొనసాగితే బ్రెంట్ ధర బ్యారెల్‌కు 150 డాలర్ల వరకూ పెరగొచ్చని హెచ్చరించింది.

వివరాలు 

హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగితే..

కొటాక్ సెక్యూరిటీస్ నిపుణురాలు కాయనాత్ చైన్‌వాలా కూడా రానున్నకాలంలో చమురు ధరలు 120 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, పరిస్థితి కొనసాగితే 150 డాలర్లను తాకొచ్చని అంచనా వేసింది. నువామా ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగితే చమురు ధరలు 110 నుంచి 150 డాలర్ల మధ్యకు వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. సరఫరా అంతరాయాలు, ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు దీర్ఘకాలికంగా పెరిగే దశలోకి వెళ్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Advertisement