Ola Electric shares: పతనమైన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు.. 52 వారాల కనిష్ఠానికి..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric) షేర్లు సోమవారం 7 శాతం మేర తగ్గాయి.
కంపెనీ రిజిస్ట్రేషన్ సేవలు అందించే రోస్మెర్టా డిజిటల్ సంస్థ, ఓలా ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పై దివాలా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ షేర్ల విలువ తగ్గింది.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈలో స్టాక్ 7.12 శాతం పడిపోయి రూ.46.94 కు చేరగా, ఎన్‌ఎస్‌ఈలో 7.04 శాతం క్షీణించి రూ.46.95 గా నమోదైంది. ఇది 52 వారాల కనిష్ట స్థాయికి సమానం.
వివరాలు
1,000 మంది ఉద్యోగుల తొలగింపు
ఓలా ఎలక్ట్రిక్ షేర్లు గత కొంతకాలంగా పడిపోతున్నాయి. ఇప్పటివరకు 41.39 శాతం తగ్గగా, గత ఆరు నెలల్లో దాదాపు 56.71 శాతం మేర పతనమయ్యాయి.
ఒక్క నెలలోనే 21.34 శాతం పడిపోయాయి. గత గురువారం 1.12 శాతం నష్టంతో బీఎస్‌ఈలో రూ.50.54 వద్ద ముగిసింది.
మార్కెట్ వాటాను నిలుపుకుంటూ లాభాల్లోకి రావడానికి కంపెనీ వివిధ మార్గాలను అన్వేషిస్తోంది.
ఈ క్రమంలో పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు దివాలా పిటిషన్ దాఖలు కావడం, షేర్లు పతనం కావడం గమనార్హం.
వివరాలు
దివాలా పిటిషన్ నేపథ్యంలో..
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీకి అనుబంధ సంస్థగా కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ పై రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్ బెంగళూరులోని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు దివాలా పిటిషన్ దాఖలు చేసింది.
కంపెనీ చెల్లింపులు చేయడంలో విఫలమైందని రోస్మెర్టా పేర్కొంది. ఈ అంశాన్ని ఓలా ఎలక్ట్రిక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
అయితే ఈ ఆరోపణలను ఓలా ఎలక్ట్రిక్ ఖండించింది. న్యాయ సలహాలు తీసుకుంటున్నామని, వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ హామీ ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో షేర్ల ధర భారీగా పడిపోయింది.