
Ather Energy IPO: దలాల్ స్ట్రీట్‌లో కొత్త ఎలక్ట్రిక్ వాహన సంస్థకి స్వాగతం..రెండు శాతం ప్రీమియంతో ఏథర్ ఎనర్జీ లిస్టింగ్
ఈ వార్తాకథనం ఏంటి
దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం కొత్త కంపెనీ లిస్టయ్యింది. ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన ఏథర్ ఎనర్జీ (Ather Energy) ఈరోజు షేర్ మార్కెట్‌లో అడుగుపెట్టింది.
అయితే ఈ కంపెనీ షేర్లు ఇష్యూ ధరతో పోల్చితే కేవలం రెండు శాతం ప్రీమియంతో మాత్రమే లిస్టయ్యాయి.
ఈ కంపెనీ షేర్ ఇష్యూ ధరను రూ.321గా నిర్ణయించగా,నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో రూ.328కి, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో రూ.326కి షేర్లు లిస్ట్ అయ్యాయి.
మదుపర్ల నుంచి ఆశించిన విధంగా స్పందన లేకపోవడంతో లిస్టింగ్ రోజునే కంపెనీ షేర్లు గణనీయంగా పెరగలేకపోయాయి.
మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటిలోనే ఈ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.ఒక దశలో అయితే 5శాతం కన్నా ఎక్కువ నష్టంతో ట్రేడయ్యాయి.
వివరాలు
షేర్లలో 75 శాతం వాటాను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు (QIBs) కోసం కేటాయింపు
ఈ పబ్లిక్ ఇష్యూలో ఏథర్ ఎనర్జీ సంస్థ రూ.2,626 కోట్ల మేర నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మొత్తాన్ని సంస్థ మహారాష్ట్రలో నిర్మించబోయే ద్విచక్ర వాహనాల ఫ్యాక్టరీ కోసం,అలాగే ఇప్పటికే ఉన్నరుణ భారం తగ్గించుకోవడానికీ వినియోగించనుంది.
అంతేగాక,తమ పరిశోధన,అభివృద్ధి (R&D) సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు కూడా ఈ నిధులను వినియోగించనుంది.
ఈ ఐపీఓ కోసం ఏప్రిల్ 28 నుంచి 30వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ అందుబాటులో ఉంది.
ఈ పబ్లిక్ ఆఫర్‌లో భాగంగా సంస్థ తన షేర్లలో 75 శాతం వాటాను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు (QIBs) కోసం కేటాయించింది.
అలాగే 15శాతం షేర్లు నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(NIIs)కోసం,మిగిలిన 10శాతం షేర్లు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసింది.
వివరాలు
ఐపీఓ తీసుకువచ్చిన రెండో కంపెనీగా ఏథర్
విద్యుత్ వాహన రంగంలో ఐపీఓ తీసుకువచ్చిన రెండో కంపెనీగా ఏథర్ ఎనర్జీ నిలిచింది.
అంతేకాదు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెయిన్ బోర్డు ద్వారా మార్కెట్‌లోకి వచ్చిన తొలి పబ్లిక్ ఆఫర్ ఇదే కావడం విశేషం.
బెంగళూరును కేంద్రంగా చేసుకుని 2013లో స్థాపితమైన ఈ సంస్థను తరుణ్ మెహతా మరియు స్వప్నిల్ జైన్ కలిసి ప్రారంభించారు.
ఏథర్ ఎనర్జీ ఈవీ బ్రాండ్‌లలో ప్రస్తుతం ప్రత్యేక గుర్తింపు పొందిన కంపెనీగా నిలిచింది.