LOADING...
India-Oman CEPA: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఊరట.. ఒమన్ నుంచి ఎరువుల సరఫరా
ఇరాన్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఊరట.. ఒమన్ నుంచి ఎరువుల సరఫరా

India-Oman CEPA: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఊరట.. ఒమన్ నుంచి ఎరువుల సరఫరా

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2026
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం ప్రభావంతో ముడి చమురు సరఫరాలే కాకుండా ఎరువుల దిగుమతులపైనా ఒత్తిడి పెరుగుతున్న వేళ, భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) దేశానికి ఊరటనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు అవసరమైన ఎరువుల సరఫరా మరింత భద్రంగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారత్ దిగుమతి చేసుకునే యూరియాలో 20 నుంచి 30 శాతం వరకు గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తోంది. అలాగే ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్)దిగుమతుల్లో సుమారు 50శాతం వాటా కూడా ఈ ప్రాంతానిదే. యూరియా వంటి నత్రజని ఆధారిత ఎరువుల తయారీలో ఎల్‌ఎన్‌జీ కీలక ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది.

వివరాలు 

2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.2బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల దిగుమతి

ఈ నేపథ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఎరువుల సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు మరిన్ని ఎరువులు,పెట్రోకెమికల్ ఉత్పత్తులు సరఫరా చేసేందుకు ఒమన్ సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశీ వాణిజ్య సలహాదారు పంకజ్ ఖిమ్జీ తెలిపారు. అవసరమైతే ఐఎఫ్‌ఎఫ్‌సీవో,కృభ్కో,ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒమన్-ఇండియా ఫర్టిలైజర్ ప్రాజెక్ట్ ఉత్పత్తిలో ఒమన్ వాటాను కూడా భారత్‌కు మళ్లించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఇప్పటికే భారత్‌కు ఎరువులు,ఇంధనం,పారిశ్రామిక ముడి పదార్థాల ప్రధాన సరఫరాదారుగా ఒమన్ కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఒమన్ నుంచి 7.2బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇందులో 1.6బిలియన్ డాలర్ల ముడి చమురు, 1.2 బిలియన్ డాలర్ల ఎల్‌ఎన్‌జీ, 843 మిలియన్ డాలర్ల ఎరువులు ఉన్నాయి.

వివరాలు 

జూన్ 1 నుంచి అమల్లోకి భారత్-ఒమన్ CEPA ఒప్పందం

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్ ఇప్పటికే రష్యా,మొరాకో,ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేసియా, జోర్డాన్, కెనడా, అల్జీరియా, ఈజిప్ట్, టోగో వంటి దేశాల నుంచి ఎరువుల కొనుగోలు చేస్తోంది. గత డిసెంబరులో కుదిరిన భారత్-ఒమన్ CEPA ఒప్పందం రెండు దేశాల ఆమోదం అనంతరం జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం విలువ పరంగా భారత్ ఎగుమతి చేసే 99.38 శాతం ఉత్పత్తులకు ఒమన్ మార్కెట్‌లో సుంకరహిత ప్రవేశం లభించనుంది. ఇది యూఏఈ తర్వాత గల్ఫ్ దేశంతో భారత్ కుదుర్చుకున్న రెండో వాణిజ్య ఒప్పందం కావడం విశేషం. గల్ఫ్ ప్రాంతంలో భారత్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఒమన్, జీసీసీ దేశాలు, తూర్పు ఆఫ్రికా మార్కెట్లకు కీలక ద్వారంగా కూడా పనిచేస్తోంది.

Advertisement

వివరాలు 

జూన్ 1 నాటికి దేశంలో 199.86 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2025-26లో 11.18బిలియన్ డాలర్లకు చేరగా,అంతకుముందు ఏడాది ఇది 10.61 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇదిలా ఉండగా, ఖరీఫ్-2026 సీజన్‌కు అవసరమైన ఎరువుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించింది. ఎల్‌నినో ప్రభావంపై ఉన్న ఆందోళనల కారణంగా యూరియా అవసరాన్ని 194.02లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 190.32 లక్షల మెట్రిక్ టన్నులకు, డీఏపీ అవసరాన్ని 59.17లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 56.23 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించింది. ఖరీఫ్ 2026 కోసం మొత్తం ఎరువుల అవసరాన్ని 383.9లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. జూన్ 1 నాటికి దేశంలో 199.86 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉండగా, ఇది మొత్తం అవసరంలో 52 శాతానికి పైగా ఉంది.

Advertisement

వివరాలు 

132.43 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు 

సాధారణంగా ఈ సమయంలో ఉండే నిల్వల కంటే ఇది గణనీయంగా ఎక్కువ. హోర్ముజ్ జలసంధిపై ఆధారపడని మార్గాల ద్వారా 25 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 15 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎన్‌పీకేలు, అమ్మోనియం సల్ఫేట్‌ను భారత్ సమీకరించిందని ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ తెలిపారు. ఇవి జూన్-జూలై నెలల్లో దేశానికి చేరనున్నాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి దిగుమతులు, దేశీయ ఉత్పత్తి ద్వారా 132.43 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను భారత్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆమె వెల్లడించారు.

Advertisement