Tata Tech IPO: అదరగొట్టిన టాటా ఐపీఓ.. నిమిషాల్లోనే సబ్‌స్క్రిప్షన్ ఫుల్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ మార్కెట్లోకి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. టాటా టెక్నాలజీస్ IPOకు తొలిరోజు విశేష స్పందన లభించింది. షేర్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఫుల్ సబ్‌స్క్రిప్షన్ పొందింది. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఉదయం 10గంటలకు ప్రారంభం కాగా.. 10:36గంటలకే పూర్తిస్థాయి సబ్‌స్క్రిప్షన్ సాధించింది. దీన్ని బట్టి పెట్టబడిదారులు ఈ ఐపీఓ పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారనే విషయం స్పష్టమవుతుంది. దాదాపు 20ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీఓ కావడంతో దీనిపై చాలా రోజులుగా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. గ్రే మార్కెట్‌లో ఈ ఐపీఓకు సానుకూల స్పందన రావడంతో.. టాటా షేర్ల కోసం ఇన్వెష్టర్లు ఎగబడ్డారు.
తొలిరోజు 6.54 రెట్లు సబ్‌స్క్రిప్షన్
టాటా టెక్నాలజీస్ రూ. 3,042.51 కోట్ల సేకరణే లక్ష్యంగా ఐపీఓకు వచ్చింది. ఇది తొలిరోజు 6.54 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. మొదటి రోజు రిటైల్ ఇన్వెస్టర్లు 5.42 రెట్లు బిడ్ వేయగా.. హెచ్‌ఎన్‌ఐలు కోటాలో 11.69 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. క్యూఐబీ కోటాలో 4.08 రెట్లు బిడ్ చేసినట్లు ఎక్స్ఛేంజీలు వెల్లడించాయి. ఈ ఐపీఓలో టాటా టెక్నాలజీస్ ఉద్యోగులు 1.1 రెట్లు బిడ్ వేశారు. టాటా మోటార్స్ వాటాదారుల వాటా 9.3 రెట్లు సబ్‌స్క్రిప్షన్ చేసుకున్నారు. ఈ ఐపీఓ నవంబర్ 24న ముగియనుండగా.. షేరు ధరను రూ.475-500గా కంపెనీ నిర్ణయించింది.