Onion Exports : ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఎప్పటివరకు నిషేధం అంటే
భారతదేశంలో ఉల్లిధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2024 మార్చి వరకు ఎగుమతులపై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మరోసారి సమాన్యుడికి అందనంత దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే పలకడం గమనార్హం. ఫలితంగా ఉల్లిధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశీయంగా ఉల్లి (Onion) నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం, ధరలు అదుపులో పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.శుక్రవారం డిసెంబరు8 నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది.
వారికి మినహాయింపు ఉంది : కేంద్రం
అయితే ఇందులో కొన్ని మినహాయింపులు కల్పించింది కేంద్రం. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడ్ అయిన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడ్‌ను ఎగుమతి చేసుకోవచ్చని DGFT హామీ ఇచ్చింది. ఇదే సమయంలో ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతి ఉంటే ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని వివరించింది. దేశీయ మార్కెట్లలో ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ఇటీవలే కేంద్రీయ సర్కార్ పలుమార్లు ఎగుమతుల పాలసీని సవరించింది. ఈ ఏడాది ఆగస్టులో ఉల్లి ఎగుమతులపై 40 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది. అనంతరం అక్టోబరులో దాన్ని సవరిస్తూ ఉల్లికి కనీస ఎగుమతి ధరలను(MEP) 800 డాలర్లుగా నిర్ణయించింది. తాజాగా ఎగుమతులపై నిషేధం అమల్లోకి వచ్చింది.