Onion price: ఉల్లి ధర కేజీ రూ.25 మాత్రమే.. బఫర్ స్టాక్ 5లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు
ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నెల రోజులుగా సామాన్యులకు తక్కువ ధరకు టమాటాను తక్కువ ధరకు విక్రయిస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఉల్లిని చౌక ధరలకు అందించబోతోంది. కోఆపరేటివ్ ఏజెన్సీ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) ద్వారా ప్రజలకు కిలో ఉల్లి రూ.25కే అందించేందుకు సిద్ధమవుతోంది. సబ్సిడీ ధరకు ఉల్లిపాయల విక్రయం ఆగస్టు 21 నుంచి ప్రారంభమవుతుంది. అంతకుముందు ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశం నుంచి ఎగుమతి చేసే ఉల్లిపై 40 శాతం భారీ సుంకం విధించాలని నిర్ణయించింది. ఎగుమతులపై ఈ నిషేధం డిసెంబర్ 31, 2023 వరకు అమలులో ఉంటుంది.
బఫర్ స్టాక్ 3లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 5లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు
సెప్టెంబర్ నుంచి ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అందుకే రాబోయే నెలల్లో పండుగల సీజన్‌లో ద్రవ్యోల్బణం ప్రజలను పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు వేగవంతం చేసింది. ఎగుమతులపై నిషేధం, తక్కువ ధరకు విక్రయించడం వల్ల సామాన్యుల్లో ఉల్లి ధరల పెరుగుదల భయాన్ని పోగొట్టొచ్చని కేంద్రం భావిస్తోంది. ఉల్లి ధరలను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం తన బఫర్ స్టాక్ పరిమితిని కూడా పెంచింది. గతంలో ఉల్లి బఫర్ పరిమితిని 3లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించారు. ఇప్పుడు 5 లక్షల టన్నులకు పెంచింది. ప్రభుత్వం సహకార ఏజెన్సీలు ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్‌లను ఒక్కొక్కటి అదనంగా 1 లక్ష టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని కోరింది.