Oil Production: చమురు ఉత్పత్తి పెంపునకు ఒపెక్+ ఒకే … కానీ అమలులో సందేహాలు
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ నెలలో చమురు ఉత్పత్తి పరిమితిని పెంచాలనే అంశంపై చమురు ఎగుమతి దేశాల సమాఖ్య అయిన ఒపెక్+ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని సమాచారం. అయితే, ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడం,హర్మూజ్ జలసంధి ఇంకా పూర్తిగా తెరుచుకోకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం అమలులోకి రావడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. అందువల్ల ఈ అంగీకారం కాగితాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి మూసివేయబడింది. దీని ప్రభావంతో చమురు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా, కువైట్, అల్జీరియా, కజక్‌స్థాన్, రష్యా, ఒమన్ దేశాలు ఆదివారం సమావేశమై ఉత్పత్తి పెంపునకు అంగీకరించాయి.
వివరాలు
రోజుకు 1,88,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం
రోజుకు 1,88,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల ఈ సమాఖ్య నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన సమావేశంలో రోజుకు 2,06,000 బ్యారెళ్ల మేర ఉత్పత్తి పెంపునకు ఒపెక్+ సమ్మతి తెలిపింది. వరుసగా మూడోసారి ఉత్పత్తి పెంపుపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే కాల్పుల విరమణ కొనసాగుతూ పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగితేనే ఈ నిర్ణయాలు అమల్లోకి వచ్చే అవకాశముంది.
వివరాలు
ఒక్క చమురు బ్యారెల్ కూడా ఎగుమతి కాలేదు
గల్ఫ్ ప్రాంతంలోని కువైట్ దేశం ఏప్రిల్ నెలలో ఇతర దేశాలకు ఒక్క బ్యారెల్ చమురు కూడా పంపలేదని ట్యాంకర్ ట్రాకర్ అనే సంస్థ వెల్లడించింది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఒక నెలలో ఎలాంటి చమురు ఎగుమతి జరగకపోవడం ఇదే తొలిసారి అని తెలిపింది. ఎగుమతులు నిలిచిపోయినా, దేశంలో ఉత్పత్తి అయిన ముడి చమురును కొంత భాగం నిల్వ చేసుకుంటూ, మరికొంత భాగాన్ని శుద్ధి చేసి వినియోగ ఉత్పత్తులుగా మార్చుతున్నట్లు సమాచారం.