
PAN 2.0:18 నెలల్లో అందుబాటులోకి పాన్ 2.0 సేవలు.. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ కీలక బాధ్యత!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు సంబంధించిన అభివృద్ధిలో కీలక మైలురాయి చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన బాధ్యతను ఆదాయపు పన్ను శాఖ ప్రముఖ టెక్నాలజీ కన్సల్టింగ్, డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree)కు అప్పగించింది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ పూర్తై సేవలు అందుబాటులోకి రావడానికి దాదాపు 18 నెలలు పట్టే అవకాశముంది. పాన్ 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా వినియోగదారులకు PAN, TAN అలాట్‌మెంట్, అప్‌డేట్స్/కరెక్షన్లు, ఆధార్‌తో పాన్ లింకింగ్, ఆన్‌లైన్ పాన్ వాలిడేషన్ వంటి ముఖ్యమైన సేవలు ఒకే వేదికపై లభించనున్నాయి. ఈ లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న మూడు వేర్వేరు పోర్టల్స్‌ను ఏకీకృతం చేయనున్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం రూ.1,435 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.
Details
డిజిటల్ వ్యవస్థల్లో 'సాధారణ వ్యాపార గుర్తింపు'
దీని ద్వారా శాశ్వత ఖాతా సంఖ్య (PAN)ను ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్ వ్యవస్థల్లో 'సాధారణ వ్యాపార గుర్తింపు' (Common Business Identifier)గా వినియోగించాలన్న లక్ష్యంతో ముందుకెళ్లుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వివిధ సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. చివరకు ఎల్‌టీఐ మైండ్‌ట్రీ విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచి, రూ.792 కోట్ల బిడ్డును సమర్పించినట్లు అధికారిక డాక్యుమెంట్లు తెలియజేస్తున్నాయి. ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాలపై మంత్రివర్గ సంఘం (Cabinet Committee on Economic Affairs) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌తో వినియోగదారులకు పాన్‌కు సంబంధించిన అన్ని సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.