LOADING...
PM Modi-Meloni Meet: మోదీ-మెలోనీ 'మెలోడీ' సందడి.. ఒక్కసారిగా 'పార్లే' షేర్లు
మోదీ-మెలోనీ 'మెలోడీ' సందడి.. ఒక్కసారిగా 'పార్లే' షేర్లు

PM Modi-Meloni Meet: మోదీ-మెలోనీ 'మెలోడీ' సందడి.. ఒక్కసారిగా 'పార్లే' షేర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ఉన్న స్నేహం మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఈ ఇద్దరు నాయకులు తమ అనుబంధానికి గుర్తుగా ఉపయోగించిన 'మెలోడీ' పదం ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. ఈ పర్యటనలో మోదీ.. మెలోనీకి 'మెలోడీ' చాక్లెట్లను కానుకగా అందజేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అంతర్జాలంలో విస్తృతంగా ప్రచారం కావడంతో మదుపర్ల దృష్టి ఒక్కసారిగా పార్లే పేరుపై పడింది. ఆ ప్రభావంతోనే షేర్‌ మార్కెట్‌లో పార్లే ఇండస్ట్రీస్‌కు చెందిన షేర్లలో భారీ లావాదేవీలు నమోదయ్యాయి.

వివరాలు 

రీసైక్లింగ్‌ విభాగంలోనూ సేవలు అందిస్తున్న పార్లే ఇండస్ట్రీస్‌ సంస్థ

స్టాక్‌ మార్కెట్‌ వివరాల ప్రకారం.. ఒక్కరోజులోనే దాదాపు 8 లక్షల పార్లే ఇండస్ట్రీస్‌ షేర్లు కొనుగోలు, అమ్మకాల రూపంలో చేతులు మారాయి. సాధారణంగా వారానికి సుమారు 2 లక్షల షేర్లు, నెలకు దాదాపు 3 లక్షల షేర్ల వరకు మాత్రమే లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే నేటి వ్యాపారంలో నమోదైన సంఖ్య అసాధారణంగా పెరగడం మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. మౌలిక వసతులు, భవన నిర్మాణ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పార్లే ఇండస్ట్రీస్‌ సంస్థ రీసైక్లింగ్‌ విభాగంలోనూ సేవలు అందిస్తోంది. ఈ సంస్థ బొంబాయి స్టాక్‌ మార్కెట్‌లో నమోదై ఉంది. అయితే 'మెలోడీ' చాక్లెట్ల తయారీతో ఈ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది.

వివరాలు 

స్టాక్‌ మార్కెట్‌లో నమోదు కానీ పార్లే ప్రొడక్ట్స్

'మెలోడీ' చాక్లెట్లను తయారుచేస్తున్నది పార్లే ప్రొడక్ట్స్‌ సంస్థ. పార్లే-జీ బిస్కెట్లు, మొనాకో, హైడ్ అండ్ సీక్‌, మాంగోబైట్‌ వంటి ప్రముఖ ఉత్పత్తులు ఈ సంస్థవే. మెలోనీ వీడియో వైరల్‌ అయిన వెంటనే సంస్థ స్పందిస్తూ.. "1983 నుంచే దేశాల మధ్య బంధాలను తియ్యగా మార్చుతున్నాం" అంటూ సామాజిక మాధ్యమాల్లో సందేశాన్ని పంచుకుంది. ముంబయిని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న పార్లే ప్రొడక్ట్స్‌ సంస్థ మాత్రం స్టాక్‌ మార్కెట్‌లో నమోదు కాలేదు. అయితే 'పార్లే' పేరుతో ఉన్న మరో సంస్థ షేర్లను మదుపర్లు కొనుగోలు చేయడంతో కొంత గందరగోళం నెలకొన్నట్లు మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

'మెలోడీ' ప్రభావంతో ప్రస్తుతం ఈ షేరులో కాస్త ఉత్సాహం

భారీ కొనుగోళ్ల ప్రభావంతో పార్లే ఇండస్ట్రీస్‌ షేరు నేటి వ్యాపారంలో గరిష్ఠ పరిమితిని తాకినా.. అనంతరం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. గత వారం రోజుల్లో ఈ షేరు విలువ 5.63 శాతం, నెల రోజుల వ్యవధిలో 4 శాతం మేర పెరిగింది. అయితే మూడు నెలల కాలంలో 35 శాతం వరకు పడిపోగా.. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు 41 శాతం నష్టాన్ని చవిచూసింది. 'మెలోడీ' ప్రభావంతో ప్రస్తుతం ఈ షేరులో కాస్త ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ.. మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే ఇంకా ఒత్తిడి కొనసాగుతున్నట్టే కనిపిస్తోంది. కాగా, మెలోనీ, మోదీ పేర్లలోని అక్షరాలను కలిపి ఈ ఇద్దరు నేతలు సరదాగా 'మెలోడీ' అనే పదాన్ని రూపొందించుకున్నారు.

Advertisement