LOADING...
Insolvency and Bankruptcy Code (Amendment) Bill: లోక్‌సభలో ఐబీసీ సవరణ బిల్లు 2025 ఆమోదం
లోక్‌సభలో ఐబీసీ సవరణ బిల్లు 2025 ఆమోదం

Insolvency and Bankruptcy Code (Amendment) Bill: లోక్‌సభలో ఐబీసీ సవరణ బిల్లు 2025 ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 30, 2026
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (IBC) సవరణ బిల్లు-2025ను లోక్‌సభ సోమవారం ఆమోదించింది. సెలెక్ట్ కమిటీ సూచనలతో రూపొందించిన ఈ బిల్లులో మొత్తం 12 కీలక సవరణలు ప్రతిపాదించారు. ప్రస్తుత వ్యవస్థను మరింత బలపరచడం, అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడం ఈ సవరణల ప్రధాన లక్ష్యం. బిల్లును చర్చకు ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, 2016లో ప్రవేశపెట్టిన ఐబీసీ చట్టాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ సవరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. గతంలో వచ్చిన అనుభవాలు, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసులు, కోర్టులు,ట్రైబ్యునల్స్ ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు.

వివరాలు 

ఆర్థిక వ్యవస్థలో ఐబీసీ కీలక పాత్ర

ఐబీసీ చట్టం వల్ల ఒత్తిడిలో ఉన్న సంస్థలు పూర్తిగా మూతపడకుండా కొనసాగేందుకు అవకాశం కలిగిందని మంత్రి తెలిపారు. కంపెనీల విలువను కాపాడుతూ, వాటిని తిరిగి నిలదొక్కుకునేలా చేయడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషించిందన్నారు. దీంతో భారత బ్యాంకింగ్ రంగం మొత్తం ఆరోగ్యం మెరుగుపడిందని వివరించారు. ఎన్‌పీఏల వసూళ్లలో భారీ పురోగతి నాన్-పర్ఫార్మింగ్ ఆస్తుల (NPAs) వసూళ్ల విషయంలో ఐబీసీ మంచి ఫలితాలు ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. వివిధ మార్గాల ద్వారా బ్యాంకులు మొత్తం రూ.1,04,099 కోట్లను వసూలు చేశాయని చెప్పారు. అందులో ఐబీసీ ద్వారా మాత్రమే రూ.54,528 కోట్లు అంటే మొత్తం వసూళ్లలో 52.3 శాతం సాధించామని వెల్లడించారు.

వివరాలు 

కొత్త విధానాలు.. చిన్న కంపెనీలకు ఊతం

ఈ సవరణల్లో భాగంగా ఇప్పటి వరకు ఉన్న ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని తొలగించి, క్రెడిటర్ల ఆధ్వర్యంలో కొత్త ఇన్సాల్వెన్సీ వ్యవస్థను తీసుకొస్తున్నారు. చిన్న కంపెనీల కోసం తక్కువ కాలపరిమితితో ఈ విధానం అమలులోకి రానుంది. కోర్టు వెలుపల సెటిల్‌మెంట్లు, డెబ్టర్-ఇన్-పజెషన్ విధానం కూడా ఇందులో భాగంగా ఉంటాయి. ఈ కొత్త విధానంలో కంపెనీ నిర్వహణ ప్రస్తుత డైరెక్టర్లు లేదా భాగస్వాముల చేతిలోనే కొనసాగుతుందని, కానీ నియంత్రణ కోసం స్పష్టమైన నిబంధనలు ఉంటాయని మంత్రి వివరించారు. ఇది గతంలో క్రెడిటర్ల ఆధిపత్యం ఉన్న విధానం నుంచి ఒక మార్పుగా భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

గ్రూప్ & క్రాస్-బోర్డర్ ఇన్సాల్వెన్సీ

ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచేందుకు గ్రూప్ ఇన్సాల్వెన్సీ, క్రాస్-బోర్డర్ ఇన్సాల్వెన్సీకి సంబంధించిన విధానాలను కూడా ఈ సవరణల్లో చేర్చారు. దీంతో అంతర్జాతీయ పెట్టుబడులకు మరింత అవకాశాలు ఏర్పడనున్నాయి. పారదర్శకతకు ప్రాధాన్యం సెలెక్ట్ కమిటీ ఇచ్చిన 11 సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి తెలిపారు. అదనంగా మరో సవరణను చేర్చినట్లు చెప్పారు. క్రెడిటర్ల కమిటీ తమ నిర్ణయాలకు కారణాలను నమోదు చేయాల్సిన నిబంధనను ప్రవేశపెట్టారు. ఇది పరిష్కార ప్రక్రియలో పారదర్శకతను పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement