Atal Pension Yojana: నెలకు రూ.210 కడితే చాలు.. 60 ఏళ్ల తర్వాత రూ.5000 పెన్షన్, రూ.8.50 లక్షల కార్పస్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ రూపంలో ఆదాయం లభిస్తుంది. దీంతో రిటైర్మెంట్ అనంతరం వారి జీవితం ఆర్థికంగా కొంత భద్రంగా ఉంటుంది. అయితే భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు ఇలాంటి సామాజిక భద్రతా సౌకర్యాలు చాలా అరుదుగా ఉంటాయి. రోజువారీ కూలీపై ఆధారపడే వీరికి వృద్ధాప్యంలో ఆదాయం లేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో అసంఘటిత రంగ కార్మికులకు కూడా 60ఏళ్ల తర్వాత పెన్షన్ అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'అటల్ పెన్షన్ యోజన' (APY) అనే ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో ఇప్పటికే 9కోట్ల మందికి పైగా చేరినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
వివరాలు
అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన సామాజిక భద్రతా పథకాలలో అటల్ పెన్షన్ యోజన ఒకటి. 2015 కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. దీనిని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తోంది. తక్కువ ఆదాయం కలిగిన అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకంలో చేరిన సభ్యులు 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు హామీతో కూడిన పెన్షన్ పొందుతారు. పెన్షన్ పొందుతున్న సమయంలో చందాదారు మరణిస్తే జీవిత భాగస్వామికి అదే పెన్షన్ అందుతుంది. అనంతరం భాగస్వామి కూడా మరణిస్తే మొత్తం కార్పస్ నామినీ లేదా వారసులకు అందజేస్తారు.
వివరాలు
అర్హతలు, ప్రీమియం వివరాలు
అటల్ పెన్షన్ యోజనలో చేరేందుకు కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు. ఈ పథకంలో చెల్లించాల్సిన నెలవారీ ప్రీమియం వయసును బట్టి మారుతుంది. సభ్యులు తమకు భవిష్యత్తులో ఎంత పెన్షన్ కావాలో నిర్ణయించుకుని దానికి అనుగుణంగా చందాలు చెల్లించాలి. 18 ఏళ్ల వయసులో పథకంలో చేరిన వ్యక్తి 60 ఏళ్లు వచ్చే వరకు, అంటే 42 సంవత్సరాల పాటు చందా చెల్లించాల్సి ఉంటుంది. ఈ వయసులో చేరిన వారు నెలకు రూ.42 నుంచి గరిష్ఠంగా రూ.210 వరకు చెల్లించవచ్చు. నెలకు రూ.210 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.5000 పెన్షన్ లభిస్తుంది. అదే 40 ఏళ్ల వయసులో పథకంలో చేరితే 20 సంవత్సరాల పాటు చందా చెల్లించాలి.
వివరాలు
పెన్షన్ మొత్తాలు
వీరు నెలకు రూ.291 నుంచి రూ.1454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. రూ.5000 పెన్షన్ పొందాలంటే నెలకు రూ.1454 చెల్లించాలి. ఈ పథకంలో సభ్యులు తమ కంట్రిబ్యూషన్ ఆధారంగా నెలకు రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000 లేదా రూ.5000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది. వయసు తక్కువగా ఉన్నప్పుడు చేరితే తక్కువ ప్రీమియంతోనే అధిక పెన్షన్ పొందవచ్చు. మూడు ప్రధాన ప్రయోజనాలు అటల్ పెన్షన్ యోజన ద్వారా సభ్యులకు మూడు ముఖ్యమైన ప్రయోజనాలు లభిస్తాయి. 1. 60 ఏళ్ల తర్వాత హామీతో కూడిన నెలవారీ పెన్షన్. 2. చందాదారు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ కొనసాగింపు. 3. ఇద్దరూ మరణిస్తే కార్పస్ మొత్తాన్ని నామినీకి చెల్లింపు.
వివరాలు
కార్పస్ మొత్తాల వివరాలు ఇలా ఉన్నాయి:
రూ.1000 పెన్షన్ ఎంచుకుంటే కార్పస్ రూ.1.70 లక్షలు. రూ.2000 పెన్షన్ ఎంచుకుంటే కార్పస్ రూ.3.40 లక్షలు. రూ.5000 పెన్షన్ ఎంచుకుంటే కార్పస్ రూ.8.50 లక్షలు. పథకంలో ఎలా చేరాలి? అటల్ పెన్షన్ యోజనలో పోస్టాఫీసులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా చేరవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఆఫ్‌లైన్‌లో చేరాలనుకుంటే సమీప బ్యాంక్ శాఖకు వెళ్లి దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఆన్‌లైన్‌లో అయితే బ్యాంక్ మొబైల్ యాప్ లేదా eNPS పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్, వయసు ధ్రువీకరణ పత్రం, కేవైసీ డాక్యుమెంట్లు అవసరం.
వివరాలు
ఆటో డెబిట్ సౌకర్యం
ఈ పథకంలో సభ్యులు తమ బ్యాంక్ ఖాతాను కంట్రిబ్యూషన్ ఖాతాతో లింక్ చేసి ఆటో డెబిట్ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి నెలా ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. లేదంటే పెనాల్టీ విధిస్తారు. నెలకు రూ.100 వరకు చెల్లించే వారికి రూ.1 పెనాల్టీ. రూ.101 నుంచి రూ.500 వరకు చెల్లించే వారికి రూ.2 పెనాల్టీ. రూ.501 నుంచి రూ.1000 వరకు చెల్లించే వారికి రూ.5 పెనాల్టీ. రూ.1000కు పైగా చెల్లించే వారికి రూ.10 పెనాల్టీ విధిస్తారు. ఆరు నెలల పాటు వరుసగా చందా చెల్లించకపోతే ఖాతా నిలిపివేస్తారు. 24 నెలల పాటు చందాలు చెల్లించకపోతే ఖాతాను మూసివేసి, అప్పటి వరకు చెల్లించిన మొత్తాన్ని తిరిగి అందజేస్తారు.
వివరాలు
60 ఏళ్లకు ముందే మరణిస్తే?
అటల్ పెన్షన్ యోజనలో చేరిన వ్యక్తి 60 ఏళ్లు పూర్తికాకముందే మరణిస్తే ఆ ఖాతాను జీవిత భాగస్వామి కొనసాగించే అవకాశం ఉంటుంది. చందాదారు 60 ఏళ్లు పూర్తిచేసే వరకు ఖాతాను కొనసాగించి, అనంతరం పెన్షన్ పొందవచ్చు. లేదా ఖాతాను మూసివేయాలనుకుంటే చందాదారు చెల్లించిన మొత్తం, దానిపై వచ్చిన వడ్డీతో సహా భాగస్వామికి చెల్లిస్తారు. ఒకవేళ చందాదారుకు వివాహం కాకపోయినా, లేదా విడాకులు తీసుకుని ఉంటే, ఆ మొత్తం నామినీకి అందజేస్తారు. అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో అమలవుతున్న అటల్ పెన్షన్ యోజన ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పెన్షన్ పథకాలలో ఒకటిగా కొనసాగుతోంది.