Stock Market Outlook: ఈ వారం స్టాక్ మార్కెట్లను నడిపించే PMI,అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు: నిపుణుల విశ్లేషణ
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే వారం స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం చూపే కీలక అంశాలపై ఆర్థిక నిపుణులు తమ అంచనాలు వెల్లడించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చల్లో కనిపించే పురోగతే సూచీల కదలికలకు ప్రధాన ఆధారంగా మారే అవకాశముందని వారు సూచించారు. అలాగే 'పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI)' డేటా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ నిమిషాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను నిర్ణయించే అంశాలేనని పేర్కొన్నారు.
వివరాలు
కంపెనీల ఫలితాలను మరింత జాగ్రత్తగా పరిశీలించే అవకాశం
ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం ప్రారంభమైన నేపథ్యంలో, ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలను తిరిగి సమీక్షించే అవకాశం ఉందని జియోజిట్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ ప్రతినిధి వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో కంపెనీల ఫలితాలను మరింత జాగ్రత్తగా పరిశీలించే అవకాశముందని చెప్పారు. బలమైన ఫండమెంటల్స్ ఉన్న రంగాల్లో పెట్టుబడి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గత వారం దేశీయ సూచీలు బలంగా ముగిసిన విషయాన్ని గుర్తుచేస్తూ, అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ముగియడం, రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలను దాటడం మార్కెట్లకు ఊతమిచ్చాయని వివరించారు.
వివరాలు
రాబోయే వారం కూడా మార్కెట్లు పాజిటివ్ మూడ్‌లో ట్రేడ్ అయ్యే అవకాశం
అంతేకాక, బిహార్‌లో ఎన్‌డీయే ప్రభుత్వానికి భారీ మెజార్టీ రావడం కూడా చివరి దశలో మార్కెట్ ట్రెండ్‌పై ప్రభావం చూపిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగాధిపతి సిద్దార్థ ఖేమ్కా తెలిపారు. అలాగే రిటైల్ ఇన్వెస్టర్ల పెరిగిన భాగస్వామ్యం,'సిప్'ల్లో వృద్ధి,ఐపీవోల జోరు.. అన్ని కలిసి సూచీలకు సపోర్ట్‌గా నిలిచాయని చెప్పారు. రాబోయే వారం కూడా మార్కెట్లు పాజిటివ్ మూడ్‌లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
వివరాలు
ఇన్వెస్టర్లు ఇతర కీలక సూచికలపై దృష్టి
రిజల్ట్ సీజన్ ముగిసిన నేపధ్యంలో ఇన్వెస్టర్లు ఇతర కీలక సూచికలపై దృష్టి పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. పండగల తర్వాత డిమాండ్ పెరుగుదల, వడ్డీ రేట్లు, ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో ప్రభుత్వ క్యాపెక్స్ వంటి అంశాలు ప్రధానంగా పరిశీలనలోకి రావచ్చని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, గత వారం స్టాక్ మార్కెట్ సూచీలు బలంగా ముగిశాయి. నిఫ్టీ 50 మొత్తం వారం 413 పాయింట్లు పెరిగి 25,910 వద్ద క్లోజ్ అయ్యింది. సెన్సెక్స్ 1,455 పాయింట్లు ఎగబాకి 84,562 వద్ద స్థిరపడింది.