Premium Petrol And Diesel Prices: ప్రీమియం పెట్రోల్,డీజిల్ మళ్లీ పెరుగుదల.. జెట్ ఫ్యూయెల్ భారీగా పెంపు..తాజా ధరలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు దేశీయ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గ్లోబల్‌గా చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల ప్రభావంగా క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా పెరుగుతుండగా, దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ధరలను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే గత నెలలో వంట గ్యాస్‌తో పాటు ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచిన చమురు సంస్థలు, ఏప్రిల్ ప్రారంభంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. ఇప్పుడు మరోసారి ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు జెట్ ఫ్యూయెల్ ధరలను కూడా పెంచుతూ వినియోగదారులపై అదనపు భారాన్ని మోపాయి.
వివరాలు
ప్రీమియం పెట్రోల్, డీజిల్ తాజా ధరలు ఇవే..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తాజాగా ప్రీమియం ఇంధన ధరలపై కీలక ప్రకటన చేసింది. XP100 గా పిలిచే ప్రీమియం పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.149 నుంచి పెరిగి రూ.160కి చేరింది. అదే విధంగా ఎక్స్‌ట్రా గ్రీన్ ప్రీమియం డీజిల్ ధర కూడా లీటరుకు రూ.91.49 నుంచి రూ.92.99కు పెరిగింది. XP100 అనేది 100 ఆక్టేన్ ఉన్న హై క్వాలిటీ పెట్రోల్. ఇది ముఖ్యంగా హైఎండ్ కార్లు, సూపర్‌బైక్‌లలో ఉపయోగిస్తారు. మెరుగైన ఇంజిన్ పనితీరు కోసం ఈ ప్రీమియం ఇంధనాలను వినియోగించడం సాధారణంగా కనిపిస్తోంది.
వివరాలు
మార్చిలోనే ప్రారంభమైన పెరుగుదల.. ఇప్పుడు మరింత భారం
యుద్ధ ప్రభావంతో మార్చి నెలలోనే స్పీడ్, పవర్ వంటి ప్రీమియం పెట్రోల్ రకాల ధరలు, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఆ సమయంలో లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకు పెరుగుదల నమోదైంది. ప్రాంతాలవారీగా స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ, ఇప్పుడు మరింత భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.46గా ఉండగా, డీజిల్ ధర రూ.95.70గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ ధరలను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తోందని ఇప్పటికే వెల్లడించింది.
వివరాలు
జెట్ ఫ్యూయెల్ ధరల భారీ పెంపు.. ఎయిర్ టికెట్లపై ప్రభావం?
ఇక విమానయాన రంగంపై కూడా ఈ పెరుగుదల ప్రభావం పడనుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ధర 8.5 శాతం మేర పెరిగి కిలోలీటరుకు రూ.1,04,927కి చేరింది. ముందు ఇది రూ.96,638.14గా ఉండేది. వాస్తవానికి ఈ పెంపు 115 శాతం వరకు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, దేశీయ విమానయాన సంస్థలకు కొంత ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం దీనిని 8.5 శాతానికే పరిమితం చేసింది. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం ATF ధరలు మరింత ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. ATF ధరలు పెరగడం వల్ల త్వరలోనే విమాన టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.