Loading...
Gold Price Drop India:ఏడాది పాటు బంగారం కొనొద్దన్న ప్రధాని.. ఇప్పుడు ధరలు తగ్గాయంటూ ప్రశంసలు
ఏడాది పాటు బంగారం కొనొద్దన్న ప్రధాని.. ఇప్పుడు ధరలు తగ్గాయంటూ ప్రశంసలు

Gold Price Drop India:ఏడాది పాటు బంగారం కొనొద్దన్న ప్రధాని.. ఇప్పుడు ధరలు తగ్గాయంటూ ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

అవసరమైతే తప్ప బంగారం కొనుగోలు చేయవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి లక్షలాది మందిని అప్పులపాలు కాకుండా కాపాడిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ప్రశంసించింది. ఈ సూచనతో నగల వ్యాపారులు, పెట్టుబడిదారులు భారీ నష్టాల నుంచి తప్పించుకోగలిగారని పేర్కొంది. ఈ మేరకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ సదరు సంస్థ ఓ లేఖ రాసింది.

వివరాలు

కిలో బంగారంపై రూ.65 లక్షల వరకు తగ్గుదల

ప్రధాని మోదీ ముందుచూపుతో చేసిన సూచన వల్లే చాలామంది నష్టాల నుంచి బయటపడ్డారని CTI ఛైర్మన్ బ్రిజేశ్ గొయల్ తన లేఖలో పేర్కొన్నారు.

ప్రధాని బంగారం కొనుగోళ్లపై హెచ్చరించిన సమయంలో కిలో బంగారం ధర రూ.1.90 కోట్లుగా ఉందని తెలిపారు. ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం సుమారు రూ.1.25 కోట్లకు చేరాయని వివరించారు.

అంటే కిలో బంగారంపై దాదాపు రూ.65 లక్షల మేర ధర తగ్గిందని చెప్పారు. అప్పట్లో ప్రధాని సూచనను పట్టించుకోకుండా బంగారం కొనుగోలు చేసినవారు ఇప్పుడు లక్షల రూపాయల నష్టాలను ఎదుర్కొంటున్నారని గొయల్ పేర్కొన్నారు.

వ్యాపార అవసరాల కోసం ముందుగానే భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేయకుండా ప్రధాని చేసిన విజ్ఞప్తి అడ్డుకుందని అభిప్రాయపడ్డారు.

వివరాలు

ఏడాది పాటు అవసరం లేకపోతే బంగారం కొనొద్దు: మోదీ

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గడంతో చాలా కుటుంబాలకు పసిడి అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.

ఇటీవల లఖ్‌నవూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బంగారం ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మే నెలలో తాను చేసిన విజ్ఞప్తి మేరకు దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లను నిలిపివేశారని, ఇప్పుడు ధరలు తగ్గాయని పేర్కొన్నారు.

తన మాట విన్నవారు డబ్బును ఆదా చేసుకోగలిగారని చెప్పారు. గతంలో తాను ప్రజలకు ఏడాది పాటు అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని సూచించినట్లు గుర్తుచేశారు.

ఆ సలహాను పాటించినవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, తన సూచనతో డబ్బు ఆదా అయిందని చెబుతున్నారని ప్రధాని వివరించారు.

ADVERTISEMENT