Star Health: టెలిగ్రామ్‌లో అమ్మకానికి స్టార్ హెల్త్ కస్టమర్ల ప్రైవేట్ డేటా
భారత్‌లో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన 'స్టార్ హెల్త్' నుండి కస్టమర్ల డేటా భారీ స్థాయిలో చోరీకి గురికావడం చర్చనీయాంశంగా మారింది. లక్షలాది కస్టమర్ల సమాచారం, అందులో మెడికల్ రిపోర్టులు, సున్నితమైన సమాచారం కూడా ఉంటాయి.అవి బహిరంగంగా విక్రయానికి ఉంచినట్లు సమాచారం వచ్చింది. టెలిగ్రామ్‌లోని చాట్‌బాట్‌లు ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నాయని ఆందోళన కలిగిస్తోంది. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఆరోపణలు వచ్చిన కొద్ది రోజుల్లోనే తాజా వ్యవహారం వెలుగుచూడటం గమనార్హం. ఒక సెక్యూరిటీ రీసెర్చర్ ద్వారా చాట్‌బాట్ సృష్టికర్త ఈ విషయం మీడియాకు తెలియజేయడంతో, మిలియన్ల మంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయానికి ఉంచినట్లు వెల్లడైంది. చాట్‌బాట్‌లను అడిగినప్పుడు వినియోగదారుల సమాచారాన్ని పొందవచ్చని ఆయన వివరించాడు.
కస్టమర్ల డేటా సురక్షితంగా ఉంటుంది: స్టార్ హెల్త్
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ ఈ ఆరోపణలపై స్పందిస్తూ, అనధికార డేటా యాక్సెస్‌కు సంబంధించి స్థానిక అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపింది. కస్టమర్ల డేటా సురక్షితంగా ఉంటుందని స్పష్టంచేసింది. చాట్‌బాట్‌ల ద్వారా పాలసీ, క్లెయిమ్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యమని పేర్కొంది. కస్టమర్ల పేర్లు,ఫోన్ నంబర్లు,చిరునామాలు,ట్యాక్స్ సమాచారం,ఐడీ కార్డులు,టెస్టుల ఫలితాల వంటి సమాచారాన్ని పొందవచ్చని కూడా తెలిపారు. మరోవైపు, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌ను గత నెలలో పారిస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై మోసం,మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుండి టెలిగ్రామ్ కంటెంట్ పై పరిశీలన పెరిగింది.ఈనేపథ్యంలోనే స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.