Page Loader
Gopal Khemka: కారు దిగుతుండగానే కాల్పులు.. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య
కారు దిగుతుండగానే కాల్పులు.. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య

Gopal Khemka: కారు దిగుతుండగానే కాల్పులు.. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు గోపాల్ ఖెమ్కా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11.40 సమయంలో బీహార్‌ రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్ సమీపంలోని తన నివాసం వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. అప్పటికే కారులో నుంచి దిగుతుండగా, బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన గోపాల్ అక్కడికక్కడే మృతి చెందారు. గోపాల్ ఖెమ్కా రాష్ట్రంలోని పురాతన మగధ దవాఖానకు యాజమాన్య బాధ్యతలు నిర్వర్తిస్తూ, బంకీపూర్ క్లబ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఆయన సోదరుడు శంకర్ ఖెమ్కా ఇచ్చిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి ఇంటికి చేరిన సమయంలో కారులో నుంచి దిగుతుండగానే దుండగులు టార్గెట్‌గా చేసుకొని కాల్పులు జరిపారని తెలిపారు.

Details

ఘటనా స్థలంలో ఒక బుల్లెట్, సెల్ స్వాధీనం

అలాగే రాత్రి 2.30 గంటల వరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోలేదని ఆయన ఆరోపించారు. పట్నా సీనియర్ పోలీసు అధికారి దీక్షా కుమారి మాట్లాడుతూ, రాత్రి 11 గంటల సమయంలో హత్యకు సంబంధించిన సమాచారం తమకు అందిందని పేర్కొన్నారు. ఘటనాస్థలంలో ఒక బుల్లెట్‌, సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను గమనిస్తున్నామని చెప్పారు. గోపాల్ ఖెమ్కాకు ఇది తలపెట్టిన మొదటి కుటుంబ విషాదం కాదు.

Details

అక్కడిక్కడే గోపాల్ ఖెమ్కా మృతి

2018లో ఆయన కుమారుడు గుంజన్ ఖెమ్కా (వయస్సు 38) కూడా ఇలాగే హత్యకు గురయ్యారు. అప్పట్లో పట్నా శివార్లలోని వైశాలీలో ఉన్న కాటన్ ఫ్యాక్టరీ వద్ద కారులో నుంచి దిగుతుండగా, బైక్‌పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఇక ఇప్పుడు ఆయన తండ్రి గోపాల్ ఖెమ్కా కూడా అదే తరహాలో హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.