PPF, SCSSలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? కొత్త నిబంధనలు, వడ్డీ రేట్లను తెలుసుకోండి
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) సహా అనేక ఇతర చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలను మార్చింది. కేంద్రం తాజాగా చేసిన సవరణ వల్ల నిబంధనలు, గతం కంటే ఇంకా సులభమయ్యాయి. పెట్టుబడిదారులు కూడా ఈ కొత్త నిబంధనల వల్ల ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. కొత్త సవరణలు నవంబర్ 9, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం SCSS పథకం కింద 5సంవత్సరాల వ్యవధికి సంవత్సరానికి 8.2% వడ్డీ రేటును కేంద్ర అందిస్తోంది. PPF వంటి దీర్ఘకాలిక పొదుపులకు 15 సంవత్సరాల కాల వ్యవధికి ఏడాదికి సంవత్సరానికి 7.1% వడ్డీ రేటును కేంద్రం అందిస్తోంది.
SCSSలో ఏమి మారిందంటే..
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మారిన నిబంధనలు ఎంతో ఉపయోగపడుతాయి. ఈ ఖాతా తెరిచే వ్యవధిని కేంద్ర పొడిగించింది. పదవీ విరమణ చేసిన మూడు నెలలలోపు ఈ పథకం కింద ఖాతాను తెరవవచ్చు. పదవీ విరమణ తర్వాత ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ఇంతకుముందు పదవివిరణ చేసిన ఒక నెల లోపు మాత్రమే ఈ ఖాతా తెరవడానికి అవకాశం ఉండేది. నవంబర్ 9న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఆ కాల వ్యవధిని ప్రభుత్వం 3 నెలలకు పెంచింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద వడ్డీ రేటు మెచ్యూరిటీ తేదీ లేదా పెరిగిన మొత్తం ఆధారంగా లెక్కించబడుతుంది.
PPF నిబంధనల్లో మార్పులు ఇవే..
PPF పథకం నియమానలను కూడా కేంద్రం మార్చింది. ఈ సవరణలు వినియోగదారులకు మరింత ప్రయోజనాన్ని చేకూర్చనున్నాయి. ఎవరైనా ముందస్తుగా ఖాతాను మూసివేయాలనుకుంటే, దాని నియమాలను కేంద్ర మార్చింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (సవరణ) పథకం 2023 ప్రకారం సవరణ జరిగింది. ఇంతకుముందు పీపీఎఫ్ ఖాతాను ముందస్తుగా మూసివేస్తే జరిమానా ఉండేది. ఇప్పుడు, ఖాతాను ముందుగా మూసివేస్తే ఎలాంటి జరిమానా ఉండదు. అయితే వడ్డీని ఒక శాతం తగ్గించి.. మిగిలిన మొత్తాన్ని వినియోగారుడికి ఇస్తారు. ఉదహారణకు ప్రస్తుతం వడ్డీ రేటు 7 శాతం ఉంటే, మీరు ఖాతాను ముందుగా మూసివేస్తే.. మీకు వడ్డీ రేటు 6 శాతంగా లెక్కిస్తారు.