Rapido: ఫుడ్ డెలివరీ విభాగంలోకి.. ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
ఫుడ్ డెలివరీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇష్టమైన ఆహార పదార్థాలను కొన్ని నిమిషాల్లోనే ఇంటికి చేరవేస్తుండడంతో ఈ సేవలకు ఆదరణ మరింత పెరుగుతోంది.
ప్రస్తుతానికి, ఈ రంగంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) రాణిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ రాపిడో (Rapido) కూడా ఈ రంగంలో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
వివరాలు
సంబంధిత సంస్థలతో చర్చలు
ప్రస్తుతం ఫుడ్ డెలివరీ విభాగంలో స్విగ్గీ, జొమాటో సంస్థలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
అయితే, ఈ విభాగంలో గట్టి పోటీని అందించేందుకు ర్యాపిడో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఫుడ్ డెలివరీ సేవలను అందించేందుకు సంబంధిత సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఈ దిశగా, పలు రెస్టారెంట్‌ల యజమానులతో సంస్థ ప్రతినిధులు సమావేశమైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు అమలు చేస్తున్న కమిషన్ విధానాన్ని సవాలు చేయాలనే ఉద్దేశంతో ర్యాపిడో వ్యాపార ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
వివరాలు
2025 నాటికి దేశవ్యాప్తంగా 500 నగరాలకు సేవలు
ర్యాపిడో 2015లో క్యాబ్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. కేవలం దశాబ్దం కంటే తక్కువ సమయంలోనే దేశంలోని రైడ్ షేరింగ్ విభాగంలో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పటికే కంపెనీ తన ద్విచక్ర వాహన సేవల ద్వారా వ్యక్తిగత రెస్టారెంట్లకు డెలివరీ సేవలను అందిస్తోంది.
ప్రస్తుతం 100 నగరాల్లో ర్యాపిడో సేవలు అందుబాటులో ఉన్నాయి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 500 నగరాలకు తన సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.