
Rapido: ర్యాపిడో 'పింక్ మొబిలిటీ' సేవలు విస్తరణ.. 2 లక్షల మంది మహిళలకు ఉపాధి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ రాపిడో (Rapido) మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన 'పింక్ మొబిలిటీ' సేవలను విస్తరిస్తోంది.
దీని ద్వారా దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా మహిళలకు స్థిరమైన ఆదాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టును మరింతగా విస్తరించనుంది.
రానున్న మూడేళ్లలో దీనికి సంబంధించిన ప్రణాళికలను అమలు చేయనున్నట్లు ర్యాపిడో ప్రకటించింది.
'పింక్ మొబిలిటీ' విస్తరణలో భాగంగా ఆజాద్ ఫౌండేషన్, శాఖా కన్సల్టింగ్ వింగ్స్ సంస్థలతో ర్యాపిడో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
Details
మహిళలకు ఉద్యోగ అవకాశాలు
ఈ భాగస్వామ్యం ద్వారా నిరుపేద మహిళలకు ప్రొఫెషనల్ డ్రైవింగ్ నైపుణ్యాలను అందించడంతో పాటు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.
రవాణా రంగంలో మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించే దిశగా ఈ ఒప్పందం ఎంతో దోహదపడనుంది.
ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొనే మహిళలు నెలకు గరిష్టంగా రూ.25,000 వరకు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని అనేక నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు ర్యాపిడో వెల్లడించింది.
'పింక్ మొబిలిటీ' కింద మహిళా కెప్టెన్లు నడిపే ప్రత్యేక వాహనాలు మహిళా ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.
ఈ వాహనాలు ఆటో రిక్షాలు, బైక్ టాక్సీలుగా విభజించబడి ఉంటాయని సంస్థ పేర్కొంది.