
Ratan Tata's will: రతన్ టాటా ఆస్తిలో బట్లర్ సుబ్బయ్యకు వాటా..కుక్క 'టిటో'కు 'అపరిమిత సంరక్షణ'
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ అయిన రతన్ టాటా తన వీలునామాలో తన జర్మన్ షెఫర్డ్ కుక్క అయిన టిటో గురించి ప్రస్తావిస్తూ, "అపరిమిత సంరక్షణ" అందించాలనే ఆశయాన్ని వ్యక్తం చేశారు.
పెంపుడు కుక్కపై ప్రేమ
రతన్ టాటా ఆస్తుల విలువ సుమారు రూ. 10,000 కోట్లుగా అంచనా వేయబడింది. ఆయన తన ఆస్తిలో తన సోదరీమణులు షిరీన్, డీనా జెజీభాయ్, ఇంటి సిబ్బంది తదితరులకు కూడా వాటాలను పంచారు.
అయితే, అత్యంత సంపన్నులలో కూడా పెంపుడు జంతువులకు వాటా ఇవ్వాలనుకోవడం ఇది ఒక అసాధారణ సందర్భం.
వివరాలు
బట్లర్ సుబ్బయ్యకు వాటా
ఆయన ఐదేళ్ల క్రితం నుండి పెంపుడు కుక్కగా పోషిస్తున్న జర్మన్ షెఫర్డ్ టిటో తనకు ఎంతో ఇష్టమైనది.
గతంలో ఉన్న టిటో చనిపోయిన తరువాత, ఈ కొత్త కుక్కకు అదే పేరు పెట్టారు. ఈ పెంపుడు కుక్కకు సంబంధించిన బాధ్యతలను తన దీర్ఘకాలిక వంటమనిషి రాజన్ షా చూసుకోవాలని రతన్ టాటా తన వీలునామాలో పేర్కొన్నారు.
రతన్ టాటా తనతో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న బట్లర్ సుబ్బయ్యకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరారు.
విదేశాలకు వెళ్లినప్పుడు, వంటమనిషి రాజన్, బట్లర్ సుబ్బయ్యల కోసం ప్రత్యేకంగా డిజైనర్ దుస్తులు కొనుగోలు చేస్తూ ఉండేవారు.
అదేవిధంగా, రతన్ టాటా తన యువ స్నేహితుడు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడు గురించి కూడా ప్రస్తావించారు.
వివరాలు
రతన్ టాటా ఆస్తులు
నాయుడుకు చెందిన గుడ్ ఫెలోస్ స్టార్ట్ అప్ లో రతన్ టాటా తన వాటాను వదులుకున్నారు. అలాగే,శంతను విద్యా రుణాలను మాఫీ చేశారు.
రతన్ టాటాకు అలీబాగ్‌లో 2,000చదరపు అడుగుల బీచ్ బంగ్లా,ముంబైలోని జుహు తారా రోడ్డులో రెండు అంతస్తుల ఇల్లు,రూ.350కోట్ల ఫిక్స్ డిపాజిట్లు,165బిలియన్ డాలర్ల టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌లో 0.83శాతం వాటా ఉన్నాయి.
రతన్ టాటా కోరిక మేరకు,టాటా సన్స్‌లో ఆయన వాటాను చారిటబుల్ ట్రస్ట్ అయిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ కు బదిలీ చేయనున్నారు.
టాటా వీలునామాను బాంబే హైకోర్టు పరిశీలించనుంది,ఇది కొద్ది నెలల సమయం పడవచ్చని అంచనా వేస్తున్నారు.
పరోపకార స్తోత్రగాథ,జంతు ప్రేమికుడిగా,వ్యాపారవేత్తగా పేరొందిన రతన్ టాటా 2024 అక్టోబర్ 9న కన్నుమూశారు.