RBI swap auction: రూపాయి పతనానికి అడ్డుకట్ట.. నగదు లభ్యత పెంచేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ కరెన్సీ రూపాయి విలువ వరుసగా తగ్గిపోతున్న పరిస్థితుల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని పెంచడంతో పాటు రూపాయి స్థిరత్వాన్ని కాపాడేందుకు 5 బిలియన్ డాలర్ల విలువైన డాలరు-రూపాయి కొనుగోలు, విక్రయ మార్పిడి వేలాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేలం మే 26న జరగనున్నట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితులను సమీక్షించిన అనంతరం మూడేళ్ల గడువుతో డాలరు-రూపాయి కొనుగోలు, విక్రయ మార్పిడి వేలాన్ని నిర్వహించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తన ప్రకటనలో తెలిపింది.
వివరాలు
బలపడనున్న విదేశీ మారక నిల్వలు
సాధారణంగా మార్కెట్‌లో రూపాయిల లభ్యతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ఇందులో వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న డాలర్లను రిజర్వ్ బ్యాంక్‌కు ఇచ్చి, దానికి బదులుగా రూపాయిలను పొందుతాయి. అనంతరం మూడేళ్ల గడువు పూర్తయ్యాక ముందుగా నిర్ణయించిన అదనపు ధరతో అదే డాలర్లను తిరిగి కొనుగోలు చేసే విధంగా ఒప్పందం కుదురుతుంది. ఈ ప్రక్రియ వల్ల బ్యాంకింగ్ రంగంలో రూపాయిల లభ్యత మెరుగుపడటమే కాకుండా విదేశీ మారక నిల్వలు కూడా బలపడతాయి.
వివరాలు
వేలంలో కనీస దరఖాస్తు పరిమాణాన్ని 10 మిలియన్ డాలర్లుగా నిర్ణయం
అదే సమయంలో రూపాయి విలువ మరింత బలహీనపడకుండా నియంత్రించేందుకు ఇది సహాయపడుతుంది. ఇరాన్ యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి కారణాలతో రూపాయి విలువపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ కరెన్సీ మరింత క్షీణించకుండా నిలువరించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. ఈ వేలంలో కనీస దరఖాస్తు పరిమాణాన్ని 10 మిలియన్ డాలర్లుగా నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.