RBI: అపోలోకు ఫెమా కేసులో వన్‌టైమ్ సెటిల్‌మెంట్.. రూ.17.76 కోట్ల జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద నమోదైన రూ.2,424.44 కోట్ల విలువైన ఉల్లంఘనల వ్యవహారంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) భారీ ఊరటనిచ్చింది. ఫెమా చట్టంలోని వివిధ నిబంధనల కింద నమోదైన ఉల్లంఘనలను కాంపౌండింగ్ విధానంలో పరిష్కరిస్తూ, వన్‌టైమ్ పేమెంట్ కింద కంపెనీపై రూ.17.76 కోట్ల జరిమానా విధించి మాఫీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సంస్థ డైరెక్టర్లు, అధికారులైన ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి, ఎస్‌కే వెంకటరామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్, ఎస్‌ఎం కృష్ణన్‌లకు ఒక్కొక్కరిపై రూ.18 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం వెల్లడించింది.
వివరాలు
రద్దవనున్న న్యాయవిచారణ ప్రక్రియలు
ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, అధికారులకు సంబంధించిన ఫెమా ఉల్లంఘనల కేసులో ఆర్‌బీఐ, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్-1999లోని సెక్షన్ 15 కింద కాంపౌండింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫెమా చట్టం కింద వారిపై కొనసాగుతున్న న్యాయవిచారణ ప్రక్రియలు రద్దవుతాయి. ఈ వ్యవహారంలో ఈడీ జారీ చేసిన నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ)ఆధారంగానే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టి,ఫెమా చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు ఫిర్యాదు దాఖలు చేసింది. అనంతరం ఫెమా చట్టంలోని సెక్షన్ 15 కింద ఉల్లంఘనలకు మాఫీ కల్పించాలని అపోలో హాస్పిటల్స్ ఆర్‌బీఐకి దరఖాస్తు చేసింది.
వివరాలు
అపోలో చేసిన ప్రధాన ఉల్లంఘనలు ఇవే..
దీనిపై ఆర్‌బీఐ ఈడీ అభిప్రాయం కోరగా,చట్ట నిబంధనలకు లోబడి కాంపౌండింగ్‌కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ తెలిపింది. దీంతో ఆర్‌బీఐ వన్‌టైమ్ పేమెంట్ కింద ఈ కేసును పరిష్కరించింది. రిటైల్ ట్రేడ్ రంగంలో ఎఫ్‌డీఐ ఉల్లంఘన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి లేని రిటైల్ ట్రేడ్ రంగంలో పెట్టుబడులను స్వీకరించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకోలేదు. ఈ ఉల్లంఘన విలువ రూ.859.87 కోట్లుగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్‌సీసీబీలు జారీ ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ (ఎఫ్‌సీసీబీలు) నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఉల్లంఘన విలువ రూ.70.02 కోట్లు.
వివరాలు
అపోలో చేసిన ప్రధాన ఉల్లంఘనలు ఇవే..
ఎఫ్‌ఐఐ-పీఐఎస్ పరిమితిని దాటిన విదేశీ పెట్టుబడులు ఎఫ్‌ఐఐ-పీఐఎస్ మార్గంలో విదేశీ పెట్టుబడులను స్వీకరించడం ద్వారా పెయిడప్ క్యాపిటల్‌పై ఉన్న 24 శాతం పరిమితిని కంపెనీ అతిక్రమించింది. ఈ ఉల్లంఘన విలువ రూ.623.87 కోట్లుగా నమోదైంది. మొత్తం ఎఫ్‌డీఐ పరిమితి మించి పెట్టుబడులు సంబంధిత రంగానికి అనుమతించిన 51 శాతం ఎఫ్‌డీఐ పరిమితిని మించి విదేశీ పెట్టుబడులు స్వీకరించినట్లు ఈడీ గుర్తించింది. ఈ ఉల్లంఘన విలువ రూ.870.66 కోట్లుగా ఉంది. ఈ నాలుగు ఉల్లంఘనలతో కలిపి మొత్తం రూ.2,424.44 కోట్ల మేర ఫెమా నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని ఈడీ తెలిపింది.
వివరాలు
మొత్తం ఎఫ్‌డీఐ పరిమితి మించి పెట్టుబడులు
అయితే, కాంపౌండింగ్ విధానంలో భాగంగా అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ నుంచి రూ.17.76 కోట్ల జరిమానా, డైరెక్టర్లు, అధికారుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.18 లక్షల చొప్పున జరిమానా వసూలు చేసి అన్ని ఉల్లంఘనలను మాఫీ చేసింది. దీంతో అపోలో హాస్పిటల్స్, దాని డైరెక్టర్లు, అధికారులపై ఫెమా చట్టం కింద కొనసాగుతున్న అన్ని న్యాయ విచారణ ప్రక్రియలు రద్దవుతాయని ఈడీ స్పష్టం చేసింది.