లండన్ లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు. ఈ మేరకు 2023 ఏడాదికి గానూ లండన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ బిరుదును స్వీకరించారు. ఈ మేరకు సెంట్రల్ బ్యాంకింగ్ అంతర్జాతీయ ఎకనామిక్స్ పరిశోధన సంస్థ దాస్ ను అర్హుడిగా గుర్తించింది. అయితే ఈ అవార్డు అందుకున్న రెండో భారతీయుడిగా, రెండో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా దాస్ చరిత్రకెక్కారు. 2015లో అప్పటి గవర్నర్ రఘురామ్ రాజన్ తొలిసారిగా ఈ టైటిల్ గెలుచుకున్నారు. ఓవైపు ప్రపంచ ఆర్థిక రంగం ఒడిదుడుకుల ఎదుర్కొంటున్నా, మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో దాస్ విజయవంతమయ్యారని ఆ సంస్థ కితాబిచ్చింది.
దాస్ విధానపరమైన నిర్ణయాలతో ఒడ్డెక్కిన భారత్ : లండన్ సెంట్రల్ బ్యాంకింగ్
2018లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియమితులయ్యే నాటికే దేశంలో (ఎన్‌బీఎఫ్‌సీ) బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల రూపంలో ఎన్నో ఆర్థిక సమస్యలున్నాయి. ఒకదశలో లిక్విడిటీ క్రంచ్ పెరిగి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కరెన్సీ నిల్వలు తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువ ఉన్న సందర్భాన్నే లిక్విడిటీ క్రంచ్ అంటారు. ఈ పరిస్థితుల్లో ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ పగ్గాలు చేపట్టిన దాస్, భారత ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించారు. ప్రపంచాన్నే గడగడలాడించిన కొవిడ్ వ్యాప్తిలోనూ భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ తగలే అవకాశమున్నా నేపథ్యంలోనూ దాస్ సమర్థంగా పనిచేసి భారత్ ను గట్టెంకించారని లండన్ సెంట్రల్ బ్యాంకింగ్ కీర్తించింది.
ఇబ్బందికర పరిస్థితులనూ దాస్ అధిగమించారు : సెంట్రల్ బ్యాంకింగ్
ఒకవైపు నగదు నిల్వల తరుగుదల, పెరిగిన రుణ ఎగవేతదారులు, నాన్ - పెర్ఫార్మింగ్ అసెట్స్ లు ( ఎన్.పీ.ఏ)లు సైతం పెరుగుతున్న క్రమంలో ఎదురైన ఇబ్బందికర పరిస్థితులనూ దాస్ అధిగమించారని లండన్ సెంట్రల్ బ్యాంకింగ్ కొనియాడింది. తాజాగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితి స్థబ్ధుగా మారిపోయింది. డాలర్ తో పోల్చితే రూపాయి విలువ తగ్గడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం సహా మరెన్నో ఇతర సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంది. ఈ క్రమంలో దాస్ నాయకత్వంలో, ఎలాంటి సంక్షోభ తలెత్తినా కీలకమైన సంస్కరణలు, వినూత్నమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, వృద్ధి ఆధారిత చర్యలను చేపట్టడంలో దాస్ సమర్థంగా పనిచేశారని స్పష్టం చేసింది.