Page Loader
Interest Rates: మరోసారి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ఆగస్టులో 0.25శాతం కోతకు ఛాన్స్‌..!
మరోసారి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ఆగస్టులో 0.25శాతం కోతకు ఛాన్స్‌..!

Interest Rates: మరోసారి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ఆగస్టులో 0.25శాతం కోతకు ఛాన్స్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ సంవత్సరం మార్కెట్ అంచనాలను మించి సంబరాన్ని కలిగించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ ),ఆ సంతోషాన్ని మరో కొంతకాలం కొనసాగించనుందనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల ఆగస్టులో కూడా వడ్డీ రేట్ల తగ్గింపు ఉండవచ్చని సమాచారం. ఆ నెలలో జరగనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును మరో 25బేసిస్ పాయింట్లు(0.25 శాతం)తగ్గించే అవకాశం ఉందని ఐసీఐసీఐ బ్యాంక్ అంచనా వేసింది. ప్రస్తుతం భారత్ ఆర్థిక వృద్ధి పరిస్థితి మిశ్రమంగా ఉందని ఐసీఐసీఐ తెలిపింది. పట్టణ ప్రాంతాలలో వినియోగ డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ,గ్రామీణ ప్రాంతాలలో మాత్రం స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. అమెరికాకు ఎగుమతులు నెమ్మదిగా పెరుగుతున్నాయని,కానీ ఇతర దేశాలకు ఎగుమతులు ఆశించిన స్థాయికి చేరలేదని స్పష్టంచేసింది.

వివరాలు 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 3.7 శాతం ఉంటుందని అంచనా

ఈ పరిస్థితులతో పాటు ప్రస్తుత ద్రవ్యోల్బణ స్థితిని కూడా పరిశీలించినప్పుడు వడ్డీ రేట్ల కోతకు ఆగస్టు సమయం అనుకూలంగా ఉండొచ్చని ఆర్బీఐ భావించే అవకాశం ఉందని ఐసీఐసీఐ తన నివేదికలో పేర్కొంది. వచ్చే నెల జరగనున్న ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకురావచ్చని పేర్కొంది. గత ద్రవ్య పరపతి సమీక్ష తర్వాత ద్రవ్యోల్బణం అంచనాలను మించి తగ్గుముఖం పట్టిందని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 2.9 శాతానికి తగ్గవచ్చని ఐసీఐసీఐ అంచనా వేసింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 3.7 శాతం ఉంటుందని ఇప్పటికే ఆర్బీఐ అంచనా వేసిన విషయం విదితమే.

వివరాలు 

జూన్‌లో ద్రవ్య పరపతి సమీక్షలో ఏకంగా 50బేసిస్ పాయింట్ల తగ్గింపు 

ఈ సంవత్సరం ఫిబ్రవరి,ఏప్రిల్ సమీక్షల్లో ఆర్బీఐ 0.25శాతం చొప్పున రెండు సార్లు కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. తర్వాత జూన్‌లో నిర్వహించిన ద్రవ్య పరపతి సమీక్షలో ఏకంగా 50బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇలా వరుసగా మూడు సమీక్షల్లో కలిపి 1శాతం మేరకు రెపో రేటును తగ్గించింది. బ్యాంకులు రెపోరేటును ఆధారంగా చేసుకుని గృహ రుణాలు, వాహన రుణాలు,ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఆర్బీఐ ప్రకటించిన వడ్డీ రేట్ల తగ్గింపును బ్యాంకులు పూర్తిగా తమ ఖాతాదారులకు బదిలీ చేస్తే, రుణాలపై నెలవారీ కిస్తీల భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇదేవిధంగా వచ్చే నెలలో కూడా రెపో రేటు మరింత తగ్గితే,ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి అదనంగా ఊరట కలిగే అవకాశం ఉంది.