RBI: ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి.. 6 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఆర్‌బీఐ విక్రయించిందా?
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారత్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన దిగుమతుల వ్యయం గణనీయంగా పెరగడంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు విదేశీ సంస్థాగత మదుపర్లు భారత స్టాక్ మార్కెట్లలో సుమారు రూ.2.25లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లారు. ఈ పరిణామాల కారణంగా అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ క్షీణిస్తోంది. ప్రస్తుతం దేశ విదేశీ మారక నిల్వలు 681.4బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇవి 728.49బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంటే కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 47బిలియన్ డాలర్లకు పైగా ఫారెక్స్ నిల్వలు తగ్గినట్లు స్పష్టమవుతోంది.
వివరాలు
ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యలు
ఈ పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను సంరక్షించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సుమారు 6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.57 వేల కోట్ల) విలువైన బంగారం నిల్వలను విక్రయించినట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. విదేశీ మారక నిల్వలపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. బంగారం దిగుమతులను నియంత్రించే లక్ష్యంతో కస్టమ్స్ సుంకాన్ని పెంచి 15 శాతానికి చేర్చింది. అలాగే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ,చమురు మార్కెటింగ్ కంపెనీల ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా ఉండేందుకు పెట్రోల్,డీజిల్ చిల్లర ధరలను కూడా పెంచింది.
వివరాలు
నిల్వల పరిస్థితి ఎలా ఉంది?
ఇక ఆర్‌బీఐ కూడా తన వద్ద ఉన్న బంగారం నిల్వల్లో 6 బిలియన్ డాలర్ల విలువైన పసిడిని మే 22తో ముగిసిన రెండు వారాల కాలంలో విక్రయించింది. ఆ మొత్తాన్ని విదేశీ కరెన్సీ ఆస్తులుగా మార్చి నిల్వల్లో చేర్చుకుంది. ప్రస్తుతం దేశ ఫారెక్స్ నిల్వల్లో విదేశీ కరెన్సీ ఆస్తులు 543.032 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం నిల్వల విలువ 114.786 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం కేవలం రెండు వారాల్లోనే బంగారం నిల్వల విలువ 6 బిలియన్ డాలర్లకు పైగా తగ్గడం గమనార్హం.
వివరాలు
బంగారం విక్రయాలకు ప్రధాన కారణం ఇదే
దేశఎగుమతులతో పోలిస్తే దిగుమతుల వ్యయం భారీగా పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు మరింత అధికమవుతోంది. ఇదే రూపాయి విలువపై ఒత్తిడి పెంచుతోంది.ఈ ఏడాదిలో రూపాయివిలువ దాదాపు 7శాతం వరకు పడిపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో డాలర్ నిల్వలను పెంచి, రూపాయికి బలం చేకూర్చే దిశగా ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. ఈఏడాది మార్చి నాటికి ఆర్‌బీఐ వద్ద 880.52టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. వీటిలో 77శాతం బంగారం భారత్‌లోనే నిల్వ ఉంచబడింది. అంతకు 6 నెలల క్రితం మనదేశంలో ఉన్న పసిడి నిల్వలు 66 శాతమే కావడం గమనార్హం. మిగిలింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్,బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ దగ్గర ఉండేది.