RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. దివాలా తీసిన రుణగ్రహీతలపై అధిక ఛార్జీలు విధించొద్దు
బ్యాంకులు, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వద్ద అప్పులు చేసి, ఆ తర్వాత దివాలా తీసిన వారికి ఆర్బీఐ కొంత ఉపశమనం కలిగించింది. ఈ మేరకు తన పరిధిలో పనిచేసే వాణిజ్య బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు, ఇతర రుణదాతలకు జరిమానా రూపంలో వసూలు చేసే వడ్డీ విషయంలో పారదర్శకంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్ బి ఐ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో బ్యాంకులు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉండదు. చాలా బ్యాంకులు నిబంధనల పేరుతో జరిమానా రేట్లను సాధారణం కంటే ఎక్కువగా వసూలు చేస్తుంటాయి. ఈ విషయాన్ని గమనించిన గమనించిన రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శాకలను జారీ చేసింది.
అపరాధ రుసుం,వ్యక్తిగత రుణాలపై విధించే పీనల్ ఛార్జీలు తక్కువగా ఉండాలి
కొత్త నిబంధనల ప్రకారం రుణదాతలు చెల్లింపులు చేయలేకపోతే జరిమానాను ఛార్జీల రూపంలో మాత్రమే విధించాల్సి ఉంటుంది. అంతేకానీ జరిమానా వడ్డీ ఛార్జీలను విధించకూడదు. దీన్ని ఆదాయ మార్గంగా మార్చుకోకూడదు. ముఖ్యంగా ఈ ఛార్జీలపై భవిష్యత్తులో ఎలాంటి వడ్డీని విధించకూడదు. అదే విధంగా ఆర్‌బీఐ పరిధిలోని సంస్థలు జరిమానా వడ్డీ తదితర ఛార్జీల విధానాలను తయారు చేసి ఆమోదించడానికి త్వరలోనే ఓ బోర్డు ఏర్పడనుంది. వ్యక్తిగత, వ్యాపారేతర లోన్లపై విధించే అపరాధ రుసం, వ్యక్తిగతేతర రుణాలపై విధించే పీనల్ ఛార్జీల కంటే తక్కువగా ఉండాలని పేర్కొంది. ఈ నూతన నిబంధనలన్నీ 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.