E Cheques: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. త్వరలో 'ఈ-చెక్కులు' ప్రవేశం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలపరచడం, భద్రతను పెంచడం లక్ష్యంగా భారత రిజర్వ్ బ్యాంక్ 'పేమెంట్స్ విజన్ 2028' పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. రాబోయే రోజుల్లో డబ్బు పంపిణీ విధానంలో చోటుచేసుకునే మార్పులు, ప్రవేశించబోయే కొత్త సాంకేతికతలు, వినియోగదారుల రక్షణ కోసం చేపట్టనున్న చర్యలను ఇందులో వివరంగా పొందుపరిచింది. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న కాగితపు చెక్కుల విశ్వసనీయతను, డిజిటల్ లావాదేవీల వేగాన్ని కలిపి 'ఈ-చెక్కులు' అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఆర్‌బీఐ ఆలోచిస్తోంది. దీంతో భౌతికంగా చెక్కులు రాయడం, బ్యాంకుకు వెళ్లడం వంటి అవసరం లేకుండా, పూర్తిగా డిజిటల్ రూపంలోనే భద్రతతో చెక్కులు జారీ చేసే అవకాశం కలుగుతుంది.
వివరాలు
ఈ-కామర్స్ సంస్థలపై పర్యవేక్షణ..
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ఇతర డిజిటల్ వేదికలు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారా భారీ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ సంస్థలను కూడా ఆర్బీఐ ప్రత్యక్ష పర్యవేక్షణ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనివల్ల వినియోగదారుల డేటా రక్షణ మరింత బలపడటంతో పాటు, లావాదేవీల పారదర్శకత కూడా మెరుగుపడుతుంది. ఆన్‌లైన్ మోసాల వల్ల డబ్బులు కోల్పోయిన సందర్భాల్లో బాధ్యత ఎవరిది అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 'షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్‌వర్క్'ను అమలు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
వివరాలు
ఇతర మార్పులివే..
డెబిట్, క్రెడిట్ కార్డుల మాదిరిగానే, భవిష్యత్తులో యూపీఐ వంటి ఇతర డిజిటల్ చెల్లింపు మార్గాలపై కూడా వినియోగదారులు స్వయంగా నియంత్రణ సాధించగలిగే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. అవసరం లేని సమయంలో కొన్ని రకాల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. లావాదేవీల గమ్యస్థానాన్ని స్పష్టంగా గుర్తించేందుకు 'డొమెస్టిక్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (DLEI)' వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. బ్యాంకేతర చెల్లింపు సంస్థల కోసం 'సైబర్ కీ రిస్క్ ఇండికేటర్స్ (KRI)' రూపకల్పన జరుగుతోంది. ఆధార్ ఆధారిత చెల్లింపుల్లో కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా, విదేశాలకు డబ్బు పంపడం మరియు స్వీకరించడం మరింత సులభంగా, తక్కువ ఖర్చుతో జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.
వివరాలు
డిజిటల్ చెల్లింపులే లక్ష్యం..
మొత్తంగా చూస్తే, 'పేమెంట్స్ విజన్ 2028' ద్వారా డిజిటల్ చెల్లింపులను మరింత భద్రంగా, పారదర్శకంగా, అందరికీ సులభంగా అందుబాటులోకి తీసుకురావడం ఆర్‌బీఐ లక్ష్యం. టెక్నాలజీ అభివృద్ధితో పాటు పెరుగుతున్న సైబర్ ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడం ఈ విధానాల ప్రధాన ఉద్దేశంగా నిలుస్తోంది. చాలా మంది సైబర్ బారిన పడకుండా కేంద్రం కీలక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దీనివల్ల అనేక మందికి లాభం చేకూరుతుందని వెల్లడించింది.