RBI: ఒక్క బటన్‌తో అన్ని పేమెంట్స్ నిలిపివేయొచ్చు.. ఖాతాదారులకు ఆర్బీఐ కొత్త భద్రతా ఫీచర్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంకు ఖాతాదారుల డబ్బుకు మరింత భద్రత కల్పించడంతో పాటు,వారి ఖాతాలపై పూర్తి నియంత్రణ ఉండేలా కొత్త భద్రతా విధానాలను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 'స్టాప్ స్విచ్' (Stop Switch), 'ట్రస్టెడ్ పర్సన్' (Trusted Person) అనే రెండు కొత్త సదుపాయాలను తీసుకురావాలని నిర్ణయించింది. వాణిజ్య బ్యాంకుల బాధ్యతాయుత వ్యాపార ప్రవర్తన ఆదేశాలు-2026 ముసాయిదా సవరణల్లో ఈ ప్రతిపాదనలను పొందుపరిచింది. వీటి ద్వారా ఖాతాదారులు ఒక్క బటన్ నొక్కితే తమ ఖాతా నుంచి జరిగే అన్ని డెబిట్ లావాదేవీలను నిలిపివేయవచ్చు.
వివరాలు
స్టాప్ స్విచ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
అంతేకాకుండా,పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేసే సమయంలో మరో విశ్వసనీయ వ్యక్తి అనుమతి తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించనుంది.
ఆర్బీఐ ప్రతిపాదించిన స్టాప్ స్విచ్ సదుపాయం అందుబాటులోకి వస్తే బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతా నుంచి జరిగే అన్ని డెబిట్ లావాదేవీలను ఒక్క క్లిక్‌తో తక్షణమే నిలిపివేయవచ్చు.
ముఖ్యంగా సైబర్ మోసం జరిగినట్లు అనుమానం వచ్చినప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
అయితే ఖాతాలోకి వచ్చే డబ్బుపై ఈ నియంత్రణ ప్రభావం ఉండదు.ఇతరుల నుంచి వచ్చే చెల్లింపులు యథావిధిగా కొనసాగుతాయి.
అయితే ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదు.
గతంలో ఇచ్చిన పునరావృత చెల్లింపు ఆదేశాలు,స్థాయీ సూచనలు,రుణ వాయిదాలు,బ్యాంకు ఛార్జీలు వంటి బ్యాంకు ప్రారంభించే నిర్దిష్ట డెబిట్ లావాదేవీలు కొనసాగుతాయి.
వివరాలు
స్టాప్ స్విచ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
అంతేకాకుండా, ఖాతాదారులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ డిజిటల్ చెల్లింపు మార్గాలను విడివిడిగా ఆన్ లేదా ఆఫ్ చేసుకునే వెసులుబాటును బ్యాంకులు కల్పించాలి.
అవసరమైనప్పుడు వాటిని తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రతి లావాదేవీకి,డబ్బు అందుకునే వ్యక్తికి,రోజువారీ ఖర్చులకు వేర్వేరుగా పరిమితులు విధించుకునే అవకాశం ఉంటుంది.
అలాగే అన్ని డిజిటల్ చెల్లింపు మార్గాలకు కలిపి ఒక ఉమ్మడి పరిమితిని కూడా ఖాతాదారులు నిర్ణయించుకోవచ్చు.
డెబిట్ కార్డులు,క్రెడిట్ కార్డులు,ప్రీపెయిడ్ కార్డులకు కూడా ఈ నియంత్రణలు వర్తిస్తాయి.
ఏటీఎంలు,పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలు,ఆన్లైన్ చెల్లింపులు,కాంటాక్ట్‌లెస్ పేమెంట్ల విషయంలోనూ ఖాతాదారులు తమకు అవసరమైన నియంత్రణలు పెట్టుకోవచ్చు.
దేశీయంగా, విదేశాల్లో జరిగే లావాదేవీలను విడివిడిగా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడంతో పాటు వాటికి ప్రత్యేక పరిమితులను కూడా నిర్ణయించుకోవచ్చు.
వివరాలు
పెద్ద మొత్తంలో లావాదేవీలకు మరో వ్యక్తి ఆమోదం
సైబర్ నేరగాళ్ల మోసాల కారణంగా ఖాతాదారులు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోకుండా ఉండేందుకు ఆర్బీఐ 'ట్రస్టెడ్ పర్సన్' విధానాన్ని ప్రతిపాదించింది.
దీని ప్రకారం ఖాతాదారులు తమకు నమ్మకమైన వ్యక్తిని నామినేట్ చేసుకోవచ్చు.
అయితే ఆ వ్యక్తికి తప్పనిసరిగా 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.
ఖాతాదారుడు ముందుగా నిర్ణయించుకున్న పరిమితిని మించి ఏదైనా పెద్ద లావాదేవీ జరిగితే, దానికి నామినేట్ చేసిన వ్యక్తి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయడానికి ప్రయత్నించిన వెంటనే ఆ లావాదేవీ వివరాలు నామినేట్ చేసిన వ్యక్తికి చేరుతాయి.
వాటిని పరిశీలించి ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి గంట సమయం ఉంటుంది.
వివరాలు
పెద్ద మొత్తంలో లావాదేవీలకు మరో వ్యక్తి ఆమోదం
ఒకవేళ సదరు వ్యక్తి లావాదేవీని తిరస్కరించినా, లేదా గంటలోపు ఎలాంటి స్పందన ఇవ్వకపోయినా ఆ లావాదేవీ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.
అయితే ఈ విధానం తప్పనిసరి కాదు. ఖాతాదారుడు, నామినేట్ చేసే వ్యక్తి ఇద్దరి అంగీకారం ఉంటేనే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
అంతేకాకుండా, నామినేట్ చేసిన వ్యక్తికి ఖాతాదారుడి బ్యాంకు ఖాతాను చూసే లేదా నిర్వహించే అధికారం ఉండదు.
లావాదేవీలకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక బాధ్యత కూడా వారిపై ఉండదు.
అయితే యూపీఐ చెల్లింపులు, వ్యాపారులకు చేసే చెల్లింపులు, ఇప్పటికే అమల్లో ఉన్న స్థాయీ చెల్లింపు ఆదేశాలు, ఈ-మాండేట్లు, నాచ్ మాండేట్ల ద్వారా జరిగే పునరావృత చెల్లింపులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.
వివరాలు
బ్యాంకుల నిర్లక్ష్యంపై కఠిన నిబంధనలు
డిజిటల్ మోసాల సమయంలో బ్యాంకుల బాధ్యతను మరింత స్పష్టంగా నిర్వచించేలా ఆర్బీఐ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది.
ఇప్పటివరకు ఉన్న బ్యాంకు నిర్లక్ష్యానికి సంబంధించిన నిర్వచనాన్ని విస్తరించింది.
నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను అమలు చేయకపోవడం, తప్పనిసరిగా పంపాల్సిన లావాదేవీ హెచ్చరికలను కస్టమర్లకు పంపకపోవడం, మోసాలను నివేదించేందుకు నిరంతర ఫిర్యాదు వ్యవస్థను అందుబాటులో ఉంచకపోవడం వంటివి బ్యాంకుల నిర్లక్ష్యంగా పరిగణిస్తారు.
అలాగే ఖాతాదారుల ఫిర్యాదులపై సకాలంలో స్పందించకపోయినా బ్యాంకులదే బాధ్యత అవుతుంది.
బ్యాంకు సాంకేతిక వ్యవస్థల్లో లోపాలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి.
అంతేకాకుండా, మోసాలకు పాల్పడే వ్యక్తులతో బ్యాంకు ఉద్యోగులు లేదా ఇతర మూడోపక్ష సంస్థలు కుమ్మక్కైనా దాన్ని బ్యాంకు నిర్లక్ష్యంగానే పరిగణిస్తారు.
వివరాలు
ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి?
ఖాతాదారుడి ఖాతాలో మోసపూరిత లావాదేవీ జరగడానికి బ్యాంకు వైపు నుంచి ఏదైనా లోపం కారణమైతే దానికి బ్యాంకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఆర్బీఐ ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధనలు వేర్వేరు తేదీల్లో అమల్లోకి రానున్నాయి.
బ్యాంకుల నిర్లక్ష్యానికి సంబంధించిన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించింది.
మిగిలిన భద్రతా మార్గదర్శకాలు 2027 జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
అయితే బ్యాంకులు సిద్ధంగా ఉంటే అంతకంటే ముందుగానే వీటిని అమలు చేసుకునే అవకాశం కూడా కల్పించింది.
ఈ మార్పులు అమల్లోకి వస్తే డిజిటల్ చెల్లింపులపై ఖాతాదారులకు మరింత నియంత్రణ లభించడంతో పాటు సైబర్ మోసాల వల్ల జరిగే నష్టాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.